డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేలా రిజర్వు బ్యాంకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఆన్‌లైన్‌లో ‘రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్(ఆర్‌టీజీఎస్)’, ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్)’ ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని వెల్లడించింది. కాబట్టి బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి ఆ రుసుములు వసూలు చేయొద్దని, అదే రోజు నుంచి వారికి సంబంధిత ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ఆదేశించింది.
సాధారణంగా ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ కనీస రుసుములు వసూలు చేస్తుంది. ఆ మొత్తాన్ని బ్యాంకులు వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి. ఇకపై ఆ ఛార్జీలను వసూలు చేయబోమని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్పై బ్యాంకులు విధించే రుసుములు కొనసాగే అవకాశముంది.