రెండు నెలలుగా ఎండ ప్రచండంతో అల్లాడిన రాష్ట్ర ప్రజలు సోమవారం సాయంత్రం మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు. పగలు 40 డిగ్రీల వేడితో సతమతమైన జనం సాయంత్రం వర్షంతో సేద తీరారు. సీజన్ ఆరంభంలో కురిసిన వర్షం ఖరీఫ్‌లో తమకు కలిసొస్తుందని అన్నదాతలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. అత్యధికంగా నగర శివారులోని మీర్కాన్పేటలో 92.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఈదురు గాలుల బీభత్సం
హైదరాబాద్‌లో పది నిమిషాల వ్యవధిలోనే కురిసిన వాన బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, ముషీరాబాద్, శంషాబాద్, నాచారం, లాలాపేట్ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఎస్ఆర్ నగర్ పరిధిలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. రహదారులపై భారీగా నీరు చేరడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వనస్థలిపురం, జూబ్లీహిల్స్‌లలో విద్యుత్ స్తంభాలు కూలి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పలు జిల్లాల్లో...
యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురంలో తాటి చెట్టు మీదపడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా దేవరకొండలో గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందగా... మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని గ్రామాల్లో 9 విద్యుత్ నియంత్రికలు నేలకొరిగాయి. మంచిర్యాల జిల్లా టీజీపల్లి గ్రామంలో సెల్ టవర్ కూలి ఇంటిపై పడిపోయింది.
నైరుతి కాదు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ వానలకు... నైరుతి రుతుపవనాలకు సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. నైరుతి పవనాలు వేగంగా కదులుతున్నాయని... ఈ నెల 6న కేరళను తాకే అవకాశాలున్నాయన్నారు. ఇవాళ, రేపు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : వర్షం కురిసింది... నష్టం మిగిల్చింది