హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జీడిమెట్ల, సురారం, దూలపల్లి, చింతల్‌లో చిరుజల్లులు పడగా... కూకట్‌పల్లి, హైటెక్‌సిటీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, షేక్‌పేట, రాయదుర్గం, కాప్రా, బోయినపల్లి, హిమయత్‌నగర్‌లోనూ ఓ మోస్తారు వర్షం కురిసింది. నిలిచిపోయిన విద్యుత్...
దమ్మాయిగూడ, చర్లపల్లి, కుషాయిగూడ, మల్కాజిగిరి, నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కార్వాన్, మేడ్చల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఈదురు గాలుల కారణంగా హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, కొత్తపేట, ఉప్పల్, సికింద్రాబాద్, కీసరలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల మీద నీరు నిలవటం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హోర్డింగుల వద్ద జాగ్రత్త...
నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన ఈదురుగాలుల వర్షంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ స్పందించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన చోట్ల చర్యలు చేపట్టి త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. హోర్డింగుల సమీపంలో ప్రయాణించకూడదని నగరవాసులకు దాన కిశోర్ సూచించారు.
ఇవీ చూడండి: 15 శాతం వృద్ధిరేటు.. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ