హైదరాబాద్ బేగంపేట ప్రధాన రహదారిపై బీరు సీసాల లోడ్‌తో వెళ్తోన్న లారీ ప్రమాదానికి గురైంది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో పటాన్ చెరు నుంచి ఉప్పల్ ఫిర్జాదీగూడలోని మద్యం డిపోకు వెళ్తున్న లారీ... బేగంపేట ప్రకాశ్ నగర్ పైవంతెన వద్దకు రాగానే బోల్తాపడింది. ప్లైఓవర్ పైకి వెళ్తున్న కారును తప్పించబోయిన డ్రైవర్... లారీని పల్టీ కొట్టించాడు. పైవంతెన, మెట్రో ఫిల్లర్ మధ్య లారీ బోల్తాపడింది. అందులో ఉన్న 1300 కాటన్ల బీరు సీసాలు రోడ్డుపై పడటంతో సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు బోల్తాపడిన లారీలోని బీరుసీసాలను ఎవరూ ఎత్తుకెళ్లకుండా కాపలాకాశారు. అనంతరం పలువురు స్థానికులతో కలిసి బీరుసీసాలను పాదాచారుల వంతెనపైకి తరలించిన ట్రాఫిక్ పోలీసులు... 20 నిమిషాల తర్వాత వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.