భార్యాబాధితుల గోడు సభలో వినిపిస్తా: దేవడా దశరథ్ దేవడా...'అఖిల భారత భార్యా బాధితుల సంఘం' అధ్యక్షుడు. ఆ సంఘంలో 69వేల మంది సభ్యులున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో దిగారు దశరథ్. గుజరాత్ తూర్పు అహ్మదాబాద్ నియోజకవర్గం నుంచి నామపత్రం దాఖలు చేశారు. భార్యా బాధితుల కష్టాలను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నానని అందుకే వారి కోసం పోరాడతానంటున్నారు దేవడా. పురుషులకు ప్రతికూలంగా కొన్ని చట్టాల్లో ఉన్న లొసుగులపై పార్లమెంటులో గళం విప్పుతానని హామీ ఇస్తున్నారు.
"పార్లమెంటుకు ప్రజలు నన్ను గెలిపించి పంపిస్తే సమాన హక్కుల కోసం పోరాడతాను. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలి. వరకట్న నిషేధ చట్టం 498(ఏ), గృహహింస చట్టం 205, ఐపీసీ 125... ఇలా అన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. పురుషుల కోసం ఏమీ లేవు. మహిళా కమిషన్ ఉంది. అలాగే పురుషులకూ కమిషన్ ఉండాలి. ఇదే నా కోరిక, లక్ష్యం. "
--దశరథ్ దేవడా, అఖిల భారత భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడు
దేవడా గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 లోక్సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. లోక్సభకు పోటీ చేసినప్పుడు 2,300 ఓట్లు, అసెంబ్లీకి పోటీ చేస్తే 400 ఓట్లు లభించాయి.
హక్కులకై మరో గళం..
ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం తూర్పు అహ్మదాబాద్ నుంచి నరేశ్ జైస్వాల్ బరిలోకి దిగారు. పార్లమెంట్లో గళాన్ని వినిపించేందుకే ఎన్నికల బరిలో నిలిచానని చెబుతున్నారు. తన ఆశయం నెరవేరాలంటే భాజపా లేదా కాంగ్రెస్.. ఏదైనా పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు జైస్వాల్. 2015లో అహ్మదాబాద్ బల్దియా ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.