పానీపూరీ అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరు చెప్పండి...? చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు సాయంత్రం అయిందంటే ఛాట్ బండార్ల ముందు క్యూ కడతారు. కానీ తయారీదార్లు సరిగా చేతులు కడుక్కోరని... నీళ్లు శుభ్రంగా ఉండవన్న భయంతో వెనకడుగు తప్పదు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు ఇవే ప్రధానమైనవని వైద్యులు చెబుతారు.
ఈ సమస్యకు విరుగుడుగా 'పానీ'ని పూరీలోనికి నింపుకునే యంత్రాన్ని సిద్ధం చేసింది బెంగళూరులోని ఓ ఛాట్ బండార్. బిన్నయ్ పేట్‌లోని ఈటీఏ మాల్, మగడీ రోడ్‌లోని జీటీ మాల్లో వీటిని ఏర్పాటు చేసింది. వాటర్ షాట్స్ అనే సంస్థ తయారు చేసిన ఈ వెండింగ్ మిషన్‌లో ఓకేసారి ఐదుగురికి పానీపూరీ సిద్ధమవుతుంది. అది కూడావివిధ ఫ్లేవర్లలో.
కస్టమర్లకు కేవలం పూరీలను ప్లేట్లో పెట్టి అందిస్తారు. ఇక వారే వెండింగ్ మిషన్ వద్దకు వచ్చి తమకు నచ్చిన పానీని పూరీలో నింపుకుని తాగేయడమే. ఎంతో రుచికరమైన, పరిశుభ్రమైన ఈ పానీపూరీకి బెంగళూరు ప్రజలు ఫిదా అవుతున్నారు.