తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'2030కి కొత్త వృత్తి ఎంచుకోవాల్సిందే' - కరోనా అనంతరం ఉద్యోగుల వేతనాలు

కొవిడ్​ మహమ్మారి ప్రభావంతో 2030 నాటికి దేశంలో సుమారు 1.8 కోట్ల మంది.. బలవంతంగా కొత్త వృత్తిలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. శ్రామిక శక్తి నైపుణ్యాలపై మహమ్మారి శాశ్వత ప్రభావం చూపనుంది. ఈ మేరకు మెకిన్సే గ్లోబల్​ ఇన్​స్టిట్యూట్​ నివేదిక వివరిస్తోంది.

Pandemic will force 18 million Indians to find a new job by 2030
'2030కి కొత్త వృత్తి ఎంచుకోవాల్సిందే'

By

Published : Feb 20, 2021, 6:21 PM IST

Updated : Feb 20, 2021, 8:09 PM IST

కార్మిక మార్కెట్లపై కొవిడ్‌-19 ప్రభావం భారీగా పడిందని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది. కరోనా పరిణామాల ప్రభావంతో 2030కి సుమారు 1.8 కోట్ల మంది భారతీయులు బలవంతంగా కొత్త వృత్తిలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. రిటైల్, ఆహార సేవలు, ఆతిథ్యం, కార్యాలయ పాలనా విభాగాల్లోని ఉద్యోగాలపై కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. 'కొవిడ్‌ మహమ్మారి కార్మిక మార్కెట్లను దెబ్బ తీసింది. కంపెనీల్లో భౌతిక దూరం పాటించాల్సి రావడం వల్ల కొత్త పని విధానానికి మారాల్సి వచ్చింది' అని వివరించింది. ఈ నివేదికలో ఇంకా ఏం ప్రస్తావించిందంటే..

  • భారత్‌తో సహా 8 దేశాల్లో అవసరమైన కార్మిక గిరాకీ, వృత్తుల సమ్మేళనం, శ్రామిక శక్తి నైపుణ్యాలపై కొవిడ్‌-19 శాశ్వత ప్రభావం చూపనుంది.
  • కరోనాతో మారుమూల ప్రాంతాల నుంచి (రిమోట్‌) పని చేసుకునే విధానం పెరగడం, ఇ-కామర్స్, దృశ్యమాధ్యమ విధానంలో సమావేశం కావడం, కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా విస్తరించడం వల్ల వినియోగదారు ప్రవర్తన, వ్యాపార నమూనాల్లో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి.
  • దేశంలోని శ్రామిక శక్తిలో 35-55% మంది బహిరంగ ఉత్పత్తి, నిర్వహణ రంగాలపై ఆధారపడి ఉన్నారు. నిర్మాణ స్థలాలు, పొలాలు, నివాస, వాణిజ్య స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వీరు పని చేస్తున్నందున, భారత్‌పై కరోనా ప్రభావం తగ్గింది.
  • దేశంలో శారీరక, మాన్యువల్‌ నైపుణ్యాలు వినియోగించే మొత్తం పని గంటల్లో 2.2 శాతం మేర తగ్గుతాయి. ఇదే సమయంలో సాంకేతిక నైపుణ్యాలకు కేటాయించిన సమయం 3.3 శాతం పెరుగుతుంది.
  • వైరస్‌ దీర్ఘకాలిక ప్రభావాలు పరిశీలిస్తే.. తక్కువ-వేతన ఉద్యోగాల సంఖ్యను తగ్గించవచ్చు. ఈ కార్మికులు అధిక వేతనాలతో కొత్త వృత్తిని ఎంచుకోవాలంటే మరిన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, బోధన, శిక్షణ, సామాజిక సేవ, మానవ వనరులు విభాగాల్లో పని చేసేందుకు వారు సంక్లిష్ట నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి.
  • భవిష్యత్‌లో ఎక్కడినుంచైనా పని కొనసాగుతుంది. వ్యాపార ప్రయాణాలు తగ్గుతాయి.
  • కరోనా మహమ్మారి నైపుణ్యాలు పెంచుకునే (రీస్కిల్లింగ్‌) సవాలును నిరుత్సాహ పరుస్తోంది. చాలా మంది కార్మికులపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. వీరు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు పొందటానికి కంపెనీలు, విధాన రూపకర్తలు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
Last Updated : Feb 20, 2021, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details