టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ చిక్కుల్లో పడ్డారు. సంస్థ యాజమాన్య హక్కుల బదిలీలో విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. టీవీ9ను టేకోవర్ చేసిన అలంద మీడియా... కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు కనిపించడం లేదని... కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఉదయం నుంచి తనిఖీలు
రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. సంస్థ కార్యాలయంతో పాటు, రవిప్రకాశ్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. టీవీ9 వాటాల అమ్మకం, యాజమాన్యం మార్పిడికి సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. ఇటీవల కాలంలో టీవీ9 ను అలంద మీడియా టేకోవర్ చేసింది. అప్పటి నుంచి కొత్త డైరెక్టర్ల నియామకం విషయంలో వివాదం కొనసాగుతోంది. ఇవాళ కౌశిక్ రావు ఫిర్యాదుతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
రవిప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు... సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు సైబరాబాస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. తనీఖీల సమయంలో రవిప్రకాశ్ ఇంట్లో లేకపోవటం వల్ల ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు అందించారు.