క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే సాధారణ విషయం కాదు. ప్రతి ప్లేయర్‌కు అలాంటి కల ఉంటుంది. ఛాంపియన్షిప్ లాంటి టోర్నీల్లో దేశం తరఫున పాల్గొనాలని వారు ఎదురుచూస్తుంటారు. అయితే అలాంటి సందర్భం వచ్చినా, సొంత దేశం పేరును వాడుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది. ఇలాంటిదే ఓ సంఘటన ఖతార్ వేదికగా జరుగుతోన్న 'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్'లో చోటు చేసుకుంది.
ఈ టోర్నీలో బరిలోకి దిగిన రష్యన్ పోల్ వాల్టర్ ఏంజెలికా సిదొరోవా స్వర్ణం సాధించింది. ఆదివారం జరిగిన పోటీలో 4.95 మీటర్లు ఎత్తు ఎగిరి పతకం సొంతం చేసుకుంది. అయినా ఆమెకు జాతీయ గౌరవం దక్కలేదు. మెడల్ తీసుకునే సమయంలో కనీసం జాతీయ జెండాతో ఆనందాన్ని పంచుకునే అవకాశం లేకుండా పోయింది.
"స్వర్ణం అంటే స్వర్ణమే. పసిడి సాధించినందుకు సంతోషంగా ఉన్నా.. సౌకర్యంగా లేను. అయితే బంగారం సాధిస్తానని అనుకోలేదు"
-ఏంజెలికా సిదొరోవా, రష్యా క్రీడాకారిణి