పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, పట్టణ ప్రణాళిక, హైదరాబాద్ నగరపాలక సంస్థ, హైదరాబాద్ జలమండలి సంస్థలు అన్నీ పురపాలన పరిధిలోనే ఉన్నా... వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏకీకృతపురపాలక చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చట్టంలో పొందుపరచాల్సిన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలను ఒకే గొడుగుకింద తీసుకువచ్చే విధంగా ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు వచ్చే నెల మూడుతో ముగియనున్న దృష్ట్యా... కొత్త చట్ట రూపకల్పనలో వేగం పెంచారు.
అన్నింటా బల్దియా ప్రత్యేకం...
చిన్న నగరాలకు... మహానగరమైన హైదరాబాద్‌కు ఒకే నిబంధనలు సరికాదనే అంశంపై ప్రత్యేక పరిశీలన చేస్తున్నారు. రామగుండం, నిజామాబాద్ లాంటి చిన్న నగరపాలక సంస్థలను హైదరాబాద్‌తో సమానంగా భావించి నిబంధనలు రూపొందిస్తే అమలులో అనేక సమస్యలు వస్తాయని గుర్తించారు. ఒకే చట్టం ఉన్నా బల్దియాను ప్రత్యేకంగా పేర్కొనాల్సిన పరిస్థితి ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాప్రతినిధులే జవాబుదారీలు...
ప్రస్తుతం కార్పొరేషన్లలో కీలకంగా ఉన్న స్థాయి సంఘాల విధివిధానాల్లో మార్పులు చేయనున్నారు. స్థాయి సంఘాలు కాకుండా అందరు కార్పొరేటర్లను భాగస్వామ్యం చేసేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయటంలో ప్రజాప్రతినిధుల జవాబుదారీని పెంచేలా అనేక అంశాలను చట్టంలో చేర్చడంపై కసరత్తు చేస్తున్నారు. పట్టణప్రణాళికకు ప్రత్యేకచట్టం ఉన్నా... స్వతంత్ర వ్యవస్థగా కొనసాగుతోంది. కొత్త చట్టంలో పట్టణ ప్రణాళిక విభాగం పూర్తిగా పురపాలన అధీనంలోకి రానుంది. పురపాలక కమిషనర్ లేదా డైరెక్టర్ పర్యవేక్షణలో పట్టణ ప్రణాళిక కొనసాగనుంది. రెండు మూడు రోజుల్లో కొత్త పురపాలక చట్టంపై కసరత్తు కొలిక్కి వస్తుందని పురపాలకశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: నేలవిడిచి సాము చేయవద్దు: కేసీఆర్ చురక