వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్లో 56.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ విద్యార్థులు 33 వేల 44 మంది... ఏపీ నుంచి 39 వేల 39 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాజస్థాన్‌కు చెందిన నళిన్ ఖండేల్ వాల్ 701 మార్కులతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థిని జి.మాధురి రెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు సాధించి... బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. తొలి యాభై ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులు మూడింటిని కైవసం చేసుకున్నారు. విద్యార్థిని ఖురేషి అస్రా 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16... బాలికల కేటగిరీలో మూడో స్థానంలో నిలిచారు.
అమ్మాయిలదే పై చేయి
గతేడాదితో పోలిస్తే 14.52 శాతం ఎక్కువగా విద్యార్థులు పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా 15 లక్షల 19 వేల 375 మంది నీట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ... 14 లక్షల 10 వేల 755 మంది మాత్రమే పరీక్ష రాశారు. వారిలో కేవలం 56.27 శాతంతో 7 లక్షల 97వేల 42 మంది మాత్రమే అర్హత సాధించారు. ఈసారి కూడా నీట్లో అమ్మాయిలదే పైచేయి కనిపించింది. అర్హత సాధించిన వారిలో బాలికలు 4 లక్షల 45వేల 761 మంది ఉండగా... అబ్బాయిలు 3 లక్షల 51 వేల 278 మంది ఉన్నారు. అత్యధికంగా రాజస్థాన్ విద్యార్థులు 74.30 శాతం అర్హత సాధించగా... నాగాలాండ్ విద్యార్థులు కేవలం 29.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.
తెలుగురాష్ట్రాల్లో పెరిగిన ఉత్తీర్ణత
దేశవ్యాప్తంగా 465 మెడికల్ కాలేజీల్లో 66 వేల 771 ఎంబీబీఎస్ సీట్లు... 309 దంత వైద్య కళాశాలల్లో 27 వేల 148 బీడీఎస్ సీట్లు అందుబాటలో ఉన్నాయి. నీట్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. తెలంగాణ విద్యార్థులు గతేడాది 67.44 శాతం మంది అర్హత సాధించగా... ఈ ఏడాది 68.88 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ విద్యార్థులు మొత్తం 33వేల 44 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 70.20శాతం అర్హత సాధించగా... ఈ ఏడాది 72.55 శాతానికి పెరిగింది. ఏపీ విద్యార్థులు 39వేల 39 మంది అర్హత సాధించారు.