కూలిన వంతెన... ఆరుగురు మృతి మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పాదచారుల వంతెన కుప్పకూలింది. ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్(సీఎస్ఎమ్టీ) సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 31 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాత్రి 7గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. ఘటనాస్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని బయటికి తీశారు.
రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరగడం వల్ల పోలీసులు ట్రాఫిక్ ఇక్కట్లు కలగకుండా చర్యలు చేపట్టారు.
కాపాడిన రెడ్ సిగ్నల్...
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి సమీపంలోని కూడలిలో రెడ్ సిగ్నల్ పడింది. అందువల్ల వంతెన కింద వాహనాలేమీ లేవు. దీనివల్ల భారీ ప్రమాదం తప్పింది. తమ కళ్ల ముందే కుప్పకూలిన వంతెనను చూసి వాహనదారులు భయపడిపోయారు. రెడ్ సిగ్నల్ పడకపోయుంటే తాము ప్రమాదం బారిన పడేవాళ్లమని చెప్పారు.
"రెడ్ సిగ్నల్ పడటం వల్ల మేం ఆగిపోయాం. గ్రీన్ సిగ్నల్ పడకముందే వంతెన కుప్పకూలింది. ఆ సమయంలో చాలా మంది వంతెనపై ఉన్నారు. కొంచెం ముందు గ్రీన్ సిగ్నల్ పడి ఉంటే పరిస్థితి మరింత భయానకంగా ఉండేది" --- ప్రత్యక్ష సాక్షి.
ప్రముఖుల దిగ్భ్రాంతి...
పాదచారుల వంతెన కూలిన ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు 5లక్షలు
వంతెన కూలడం దురదృష్టకరమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు 50వేల పరిహారాన్ని ప్రకటించారు.
'కసబ్' వంతెన...
టైమ్స్ ఆఫ్ ఇండియా భవంతి- సీఎస్ఎమ్టీ స్టేషన్ను కలిపే ఈ వంతెనను 26/11 ముంబయి ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వినియోగించారు. అందుకే ఈ వంతెనకు 'కసబ్ వంతెన' అని పేరుపెట్టారు.