హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా కంపెనీ ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ తక్కువ ధరలో 'ఫావిపిరవిర్' ట్యాబ్లెట్ (200 ఎంజీ)ను తీసుకువచ్చింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.33. ఇంత వరకు దాదాపు పది కంపెనీలు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేశాయి. వీటన్నింటిలో ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ ట్యాట్లెట్ ధరే తక్కువ. 'ఫావిలో' అనే బ్రాండు పేరుతో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసినట్లు ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ వెల్లడించింది.
సొంత పరిశోధన- అభివృద్ధి ద్వారా ఈ ఔషధం ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్)తో పాటు, ఫార్ములేషన్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్-19 బాధితులకు వైద్యులు ఈ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్‌ను అందించటం ద్వారా ప్రజలకు అండగా నిలిచే అవకాశం తమకు దక్కినట్లు భావిస్తున్నామని ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ ఛైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ ఎంఎస్‌ఎన్ రెడ్డి పేర్కొన్నారు.