తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

అమ్మ గురించి చెప్పమని నన్ను అడిగినప్పుడు నా దగ్గర మాటల్లేవు. నా మస్తిష్కంలో ఆలోచనలు లేవు. మనసులో అమ్మ అందమైన రూపం తప్ప...! బహుశా... అమ్మ గురించి చెప్పమంటే ఆ బ్రహ్మ కూడా ఆలోచిస్తాడేమో. చెప్పలేక కాదు... ఎలా చెప్పాలో... ఎక్కడి నుంచి చెప్పాలో... ఎంతని చెప్పాలో తెలియక...!

అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

By

Published : May 12, 2019, 9:04 AM IST

Updated : May 12, 2019, 11:33 AM IST

సృష్టికి మూలం అమ్మ

అవును... అమ్మ అంటే ఒక్క పదంలోనో... ఒక్క వాక్యం లోనో... ఒక్క పాటలోనో... ఒక్క వ్యాసంలోనో... ఒక్క ప్రసంగంలోనో చెప్పేది కాదు....

అమ్మంటే జీవితం...
అమ్మంటే...
వెచ్చని స్పర్శ...
చల్లని నవ్వు...
దీపాంతల్లాంటి కళ్లు...
వెలిగిపోయే చందమామ లాంటి ముఖం...
ముద్దుముద్దుగా పలకరించే మాటలు...
చేతుల్లోనే ప్రేమగా ఊపే ఉయ్యాలలు...
ఆకలేసి ఏడిస్తే ఇచ్చే అమృతపు చుక్కలు...
ఎక్కడ దూరమవుతానోనని భయమో... నేనున్నానని ఇచ్చే ధైర్యమో... నాపైన చేయ్యేసి పడుకునే రాత్రులు...

నా తొలి చూపు... అమ్మ రూపమే...
నా తొలి పలుకు.... అమ్మ నామమే...
నా తొలి ముచ్చట.... అమ్మతోనే...
నా తొలి అడుగు... అమ్మ వెంటే...
నా తొలి అలక... అమ్మ పైనే...
నా తొలి ప్రేమ... అమ్మ మీదే...
నా తొలి గొడవ... అమ్మతోనే...
నా తొలి గురువు... అమ్మే...
ఇప్పటికి...ఎప్పటికీ... నాతో ఉండే గురువు అమ్మ...
నా తొలి స్నేహితురాలు అమ్మే...
నా ప్రపంచమే అమ్మ...
తొలి పొద్దు సూర్యుడిలో వెలుగే అమ్మ...
వేకువజామునే వినిపించే గుళ్లోని సహస్త్రనామార్చనే అమ్మ...
వాకిట్లోని పచ్చని కళ్లాపిలో వేసిన ముగ్గే అమ్మ...
దేవుడి గూట్లో వెలిగించిన అగర్బత్తిల వాసనే అమ్మ...
ఆకలైన కడుపునకు పెరుగన్నం ముద్దే అమ్మ...
అల్లరి చేసే ఆకతాయిని బుజ్జగించే మాటే అమ్మ...
చంద్రుని వెన్నెల్లో అనగనగా అంటూ చెప్పే కథే అమ్మ...
ఆడి ఆడి అలసిన పాపాయిని నిదురపుచ్చే జోలపాటే అమ్మ...
వేలుపట్టి అడుగులేయిస్తూ... నడిపించే మార్గమే అమ్మ...
బలపం పట్టి... పలక మీద దిద్దించిన అక్షరమే అమ్మ...
దెబ్బ తగిలి ఏడుస్తుంటే... అదిమి పెట్టె పసుపే అమ్మ...
కాలికి ముళ్లు గుచ్చుకుని విలవిల్లాడితే... తన కళ్లల్లో రాలే కన్నీటి చుక్కనే అమ్మ...
జ్వరమొస్తే... నుదిటిపైన వేసే తడి గుడ్డే అమ్మ...
కడప దగ్గరే కూర్చొని... నా అడుగుల కోసం చూసే ఎదురుచూపే అమ్మ...
ఖాళీ కడుపుతో పడుకుంటే... తినమని బతిమిలాడే ఆప్యాయతే అమ్మ...
అన్నింటిలో నేనే మొదటి స్థానంలో ఉండాలని పడిన ఆరాటమే అమ్మ...
భయపడితే కాదు... తెగిస్తేనే బతుకని చెప్పిన ధైర్యమే అమ్మ....
అన్నింటా నీ వెంట నేనుంటానని నిశ్శబ్దంగా కళ్లతో ఇచ్చిన భరోసానే అమ్మ...
మందలించిన నాన్నకు నన్ను వెనుకేసుకొచ్చేందుకు ఎదురు చెప్పిన అనురాగమే అమ్మ...
అర చేతుల్లో ఇమిడిపోయే నన్ను ఆరడుగుల మనిషిని చేసేంత వరకు నా కోసం పరితపించిన మనసే అమ్మ...
కేర్ మన్నప్పటి నుంచి... నా కాళ్ల మీద నేను నిలబడేవరకు కాచిన లలితాదేవి అమ్మ...
నేను చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి అమ్మే...
పొత్తిళ్లలోనే నాకో ప్రపంచాన్ని నిర్మించిన విశ్వకర్మ అమ్మ....
నాకు జీవం పోసేందుకు... తన ప్రాణాన్నే పణంగా పెట్టిన నడయాడే దేవతా మూర్తి అమ్మ...
అన్ని బాధల్ని దిగమింగుకొని... నవ్వుతూ ప్రేమ పంచే అనిర్వచనీయ భావోద్వేగం అమ్మ...
అన్ని పాత్రలు పోషిస్తూ... అందరికి ఆనందం పంచేందుకు నిర్విరామంగా... నిస్వార్థంగా...పడే... తన్మయత్వపు తపనే అమ్మ...
మాంసపు ముద్దగా ఉన్న నన్ను మానవత్వమున్న మనిషిగా తీర్చిదిద్దిన సృష్టికర్త అమ్మ....
అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

ప్రేమ అనే పదానికి రూపమిస్తే అమ్మే అవుతుందేమో...
ఆప్యాయతను అందంగా అలంకరిస్తే అమ్మలానే ఉంటుందేమో...
అనురాగానికి అలుపొస్తే అమ్మ ఒడిలో సేదతీరుతుందేమో...
అమ్మ అనే రెండక్షరాల గురించి చెప్పాలంటే
ఎన్ని లక్షల పదాలైనా చాలవు...
ఎన్ని భావాలైనా పూరించలేవు...
ఎన్ని నిఘంటువులు వెతికినా సరిపోయే అర్థాన్నివ్వలేవు...
ఎన్ని విశేషణాలిచ్చినా... సరిపోయే అలంకారమివ్వలేవు..
అమ్మ రుణం తీర్చుకోవాలంటే... ఎన్ని జన్మలైనా చాలవు...
మళ్లీ అమ్మకు అమ్మైతే తప్ప....!
ఇంకో జన్మంటూ ఉంటే... అమ్మకు జన్మనిచ్చే అదృష్టం ఇమ్మని ఆ అమ్మనడుగుతా....!!!
మా అమ్మలానే... లోకంలో ఉన్న ఎందరో అమ్మలందరి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు....
లవ్ యూ అమ్మ....

ఇదీ చూడండి : మాతృదినోత్సవం నాడు అమ్మతో సరదాగా

Last Updated : May 12, 2019, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details