పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. డబ్బు, మద్యం, బహుమతులను ఆశజూపి తమవైపు లాక్కొంటున్నారు. ప్రచారాల్లో ఎంత ఎక్కువ జనం కనబడితే అంతా బలంగా భావిస్తున్నారు. పైసలిచ్చి మరీ ప్రచారాల్లో హాజరయ్యేలా చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.41 కోట్లకు పైగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఎలా సాగుతున్నా... అక్రమమార్గాల్లో డబ్బు పంపిణీ మాత్రం ఆగడం లేదు.
ఒక్కొక్కరికి రెండొందలు:
భువనగిరి జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రోడ్‌షో నిర్వహించారు. ఈ ప్రచారంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారికి డబ్బులు పంచడం ఈటీవీ భారత్ కంటపడింది. ఒక్కోమనిషికి రెండు వందల చొప్పున పంచారు. అయితే ముందు చెప్పిన విధంగా కాకుండా తక్కువ డబ్బు ఇచ్చారని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.