ఒడిశాలోని కోరాపుట్‌లో జరిగిన సభలో మోదీ ప్రసంగం ఒడిశా అభివృద్ధికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ ఎన్డీఏ ప్రభుత్వం విడిచిపెట్టలేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు.రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తోందని వివరించారు.
లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే ఒడిశాలో భాజపా విజయమే లక్ష్యంగా ప్రచార శంఖారావం పూరించారు మోదీ. కోరాపుట్ జిల్లా జయపురలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని పరీక్షించేందుకు ఇటీవల నిర్వహించిన మిషన్ శక్తిని ప్రస్తావిస్తూ విపక్షాలపై దుమ్మెత్తిపోశారు మోదీ.
"ఒడిశా ఒక చారిత్రాక విజయానికి కేంద్రమైంది. ప్రపంచ దేశాలకు భారత్ శక్తి సామర్థ్యాలను చాటిచెప్పింది. భారత్‌కు అంతరిక్షంలోనూ కాపాలాను నిర్వహించ గల సత్తా ఉంది. ఈ ఘనతను కొంత మంది చిన్న చూపు చూస్తున్నారు. వారిని దేశమంతా గమనిస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడుల విషయంలో విపక్షాల తీరును మోదీ తప్పుబట్టారు.
"బాలాకోట్ వైమానిక దాడులకు నెలరోజులు పూర్తయింది. ఉగ్రవాదుల శవాలను లెక్కించే పనిలోనే పాకిస్థాన్ ఉంది. ప్రతిపక్షాలు మాత్రం ఆధారాలు అడుగుతున్నాయి. ఒక స్పష్టమైన ఆలోచనతో పోలింగ్ బూత్‌కు వెళ్లండి. ఉగ్రవాదులను ఇంట్లోకి చొరబడి శిక్షించే ప్రభుత్వం కావాలో, మాటలతో చేతులు దులిపేసుకునే ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలి"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి