వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రెండో బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం తిరస్కరించింది. ఆర్థిక నేరం కేసులో నీరవ్ లొంగిపోయేందుకు సుముఖంగా లేరని భారత్ తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దక్షిణ పసిఫిక్ సముద్ర ద్వీపకల్ప దేశం వనౌటు జాతీయ పౌరసత్వం కోసం నీరవ్ ప్రయత్నించిన వివరాలను పొందుపరిచారు.
నీరవ్ భారత్‌కు వెళ్లేందుకు సిద్ధంగా లేరనేందుకు బలమైన ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. రెండో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. తదుపరి వాదనలు ఏప్రిల్ 26కు వాయిదా వేసింది.
తదుపరి వాదనల సమయంలో నీరవ్‌ను జైలు నుంచే దూరదృశ్య మార్గం ద్వారా విచారిస్తారు.
రూ.14వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ.
మనీలాండరింగ్ కేసులో సాక్షులను నీరవ్ మోదీ బెదిరిస్తున్నారని భారత్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఆశిశ్ లాడ్‌ను చంపేస్తానని ఫోన్లో భయభ్రాంతులకు గురి చేసి, కోర్టులో తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే 2 మిలియన్ డాలర్లు ఇస్తానని నీరవ్ మోదీ ఆశ చూపారని కోర్టుకు వివరించారు న్యాయవాది.
ఈడీ కార్యాలయంలో వివాదాస్పద పరిణామాలు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం వివాదాస్పద పరిణామాలు జరిగాయి. నీరవ్ మోదీ మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ సత్యబ్రాత్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈడీ. తిరిగి కొద్ది సేపటికే ఆ ఆదేశాలను రద్దు చేసింది.