ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. విభజన చట్టం అమలులో కేంద్రం నిర్లక్ష్యంపై వివరించారు. హామీలు అమలయ్యేలా చూడాలని మెమోరాండం ఇచ్చారు. నూతన రాజధాని నిర్మాణంపై రాష్ట్రపతికి చంద్రబాబు వివరాలు అందించారు. కేంద్రం ఇప్పటివరకు రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. విభజన వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి సహకరించలేదని... అరకొరగా నిధులు కేటాయించారని రాష్ట్రపతి దృష్ణకి తీసుకువచ్చారు.
అబద్ధాలతోనే మోదీ కాలం గడిపారు!
హామీలు అమలు చేయడంలో కేంద్రం మాట తప్పిందన్న ఏపీ సీఎం చంద్రబాబు... విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని తాము ఎప్పట్నుంచో కోరుతున్నామన్నారు. 60 ఏళ్ల పాటు హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేశానని వివరించారు. ప్రస్తుతం అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోదీ... యమున నది నీళ్లు, పార్లమెంట్ మట్టి మాత్రమే తీసుకువచ్చారన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతోనే భాజపా కాలం వెళ్లదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్య వైఖరి గురించి రాష్ట్రపతికి వివరించామని చంద్రబాబు మీడియాకు తెలిపారు.
ఐక్యతకు సూచికగా పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మోదీకి ఐక్యత అంటే తెలియదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలు లేవన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయం కూడా మోదీకి లేదని ఆరోపించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఎంతో మంది కలత చెందుతున్నారని... ఒక వ్యక్తి నిన్న దిల్లీలో ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రపతి రాజ్యాంగపరమైన అధినేతని అంతిమంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమేనని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు