తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రత్యామ్నాయ పంటల సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు దోబూచులాడుతున్న వేళ... ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులపై వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన సంస్థలు ముందుకొచ్చాయి. జలాశయాల్లోకి నీరు రావడం ఆలస్యం కానున్నందున... జొన్న, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు, ఆముదం వంటి పైర్లు సాగు చేసుకోవాలని స్పష్టం చేశాయి.

By

Published : Jun 17, 2019, 12:50 PM IST

ప్రత్యామ్నాయ పంటల సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి

ప్రత్యామ్నాయ పంటల సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 1న ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన తర్వాత నైరుతి పవనాలు కేరళ తీరం తాకినప్పటికీ... తెలంగాణలో ప్రవేశించడంలో వాయు తుపాన్‌ అడ్డుకోవడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడింది. ఫలితంగా చినుకు జాడ లేకుండాపోయింది. వర్షం రాక కోసం ఎదురుచూస్తున్న రైతులు... భూమి చదును చేసుకుని గింజ విత్తుకుంటే ఎండల తీవ్రతకు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అధ్యక్షతన... వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌ బొజ్జ, క్రీడా సంచాలకులు డాక్టర్ రవీంద్రాచారి తదితరులు విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వివిధ పంటలకు సంబంధించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు సూచించారు. కృష్ణా నది నీరు పారుదల ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లలో నీరు ఆలస్యంగా రావడానికి అవకాశం ఉంది. వీటి ఆధారంగా వర్షాధార పంటలు విత్తుకోకూడదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.

నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన తర్వాత తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీ మీటర్లు... బరువు నేలల్లో 60 నుంచి 75 శాతం మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల తడిసిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలైన సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, పత్తి తదితర పంటలు విత్తుకోవాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకుని జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైరుగా... ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసర పైరుగా లేదా పచ్చిరొట్టగా విత్తుకోవాలని అన్నారు.


వివిధ పంటలు విత్తుకోవడానికి అనువైన సమయం


పెసర, జొన్న - జూన్ 30 వరకు
మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు - జులై 15 వరకు
కంది - జులై 31 వరకు
ఆముదం - ఆగస్టు 15 వరకు

వరి నార్లు పోసుకోవడానికి అనువైన సమయం


ధీర్ఘకాలిక రకాలు - జూన్ 20 వరకు
మధ్యకాలిక రకాలు - జులై 10 వరకు
స్వల్పకాలిక రకాలు - జులై 31 వరకు

ఇవీ చూడండి:సోమవారం నుంచి రాష్టంలో వర్షాలు..?

For All Latest Updates

TAGGED:

KHARIF

ABOUT THE AUTHOR

...view details