తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆరోగ్య భారత్​ సాకారమయ్యేదెన్నడు...? - aarogaya bharat proceedings

మన దేశ జనాభా 130 కోట్లు... అంతమందికి ఉన్నది ఎనిమిది లక్షల మంది డాక్టర్లే. అందులో అలోపతీ డాక్టర్లుగా చలామణి అవుతున్న వారిలో 31 శాతం మాధ్యమిక విధ్య అభ్యసించిన మున్నాబాయిలే. స్వయంగా మూడేళ్ల క్రితం భారత వైద్యరంగ దుస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వాస్తవాలివి. తమ జీవిత కాలంలో స్పెషలిస్టు డాక్టర్లను చూడని భారతీయులు 70 కోట్ల మంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత వైద్య రంగంలో ఏ రోగానికి ఏ మెడిసిన్ ఇవ్వాలో తెలియని డాక్టర్లు చాలామంది.

ఆరోగ్య భారత్​ సాకారమయ్యేనా...?

By

Published : Jun 6, 2019, 5:12 PM IST

ఆరోగ్య భారత్​ కలగానే మిగలనుందా...?

గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం లోపు అలోపతీ వైద్యులే వృత్తిపరమైన నైపుణ్యం కలిగినవారన్న నివేదిక... అబద్ధాల పుట్టగా కేంద్రం నిరుడు లోక్‌సభలో తోసిపుచ్చింది. దేశంలో ఇప్పటికీ అయోగ్య వైద్యసిబ్బందికి ఢోకా లేనేలేదని బ్రిటిష్​ మెడికల్ జర్నల్ తాజా కథనం. మరోవైపు డాక్టర్లు, నర్సులు, మంత్రసానులు, ఇతర పారామెడికల్ సిబ్బంది అందరినీ కలిపి లెక్కిస్తే.. 54 శాతం దాకా సరైన అర్హతలు లేని వారేనంటున్నాయి నివేదికలు. ఇందులో ఏది నిజం..? వాడుతున్న ఇంజెక్షన్లనే మళ్లీ రోగులకు పొడుస్తున్న కొందరు డాక్టర్లు.. హెచ్​ఐవీ వ్యాప్తికి కారణమవుతున్న సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి?

యూపీ ఘటనే ఉదాహరణ

దేశంలో 38 లక్షల మేర ఆరోగ్య సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నా... వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. తామూ డాక్టర్లమేనంటూ వివిధ సంఘాల్లో పేర్లు నమోదు చేయించుకున్న వారి సంఖ్య దాదాపు 25 లక్షలు. అంటే.. సిబ్బంది కరవు అధికారిక గణాంకాలను మించి ఉన్నట్లే. ఉన్న వారిలో సరైన అర్హత కలిగిన వారూ తక్కువే... ఈ కారణం కూడా నాటు, నకిలీ వైద్యులు పుట్టుకు రావడానికి ఊపిరి పోస్తోంది. యూపీలోని ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. ఉన్నవ్​ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు ఒకే సిరంజీతో ఇంజెక్షన్లు పొడిచి 40 మందికి పైగా హెచ్​​ఐవీ సోకడానికి కారణమయ్యాడు.

వెనకబాటులో అగ్రస్థానమే..

ప్రపంచ జనాభా 770 కోట్లు. అందులో మన దేశానిది 17 శాతం. నవజాత శిశువుల మరణాల్లో 27 శాతం.. అయిదేళ్లలోపు పిల్లల చావుల్లో 21శాతం.. అంతర్జాతీయ వ్యాధుల భారంలో అయిదోవంతు.. మన దేశ ఖాతాలోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పౌరుల సొంత ఆరోగ్య వ్యయం సగటున 18 శాతం. అదే మన దేశంలో అనారోగ్యం పాలైనవారే వైద్య వ్యయంలో 63 శాతం దాకా భరించాల్సి వస్తోంది. సరే.. అప్పో సప్పో చేసి బయటపడదామనుకున్నా... అరకొర వైద్య సేవలు వేదనకు గురిచేస్తున్నాయి. సరైన చికిత్స అందక దేశంలో ఏటా లక్షలమంది మృత్యువాత పడుతున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘమే నిర్థారించింది.

కేంద్రమే ఒప్పుకుంది..

చైనాతోపాటు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ సైతం వైద్య సేవల్లో మనకంటే ముందున్నాయి. దేశం నలుమూలలా 30 శాతం మేర సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 20 శాతానికిపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తగ్గినట్లు కేంద్రమే ఆ మధ్య లోక్‌సభలోనూ తెలిపింది. సిబ్బంది ఖాళీల భర్తీ పక్కనబెడితే... ఉన్న వారిలో అర్హులు అంతంత మాత్రమేనంటే... ఇంకెన్నడు స్వస్థ భారత్ సాధ్యమయ్యేది? నాటు, నకిలీ వైద్యులు రెచ్చిపోవడానికి ఇంతకన్నా అనుకూల వాతావరణం ఇంకేం కావాలి?

అలా చేస్తేనే సాధ్యం!

వచ్చే పదేళ్లలో దేశీయ ఆస్పత్రుల్లో ఆరు లక్షల 40 వేల పడకలు అదనంగా కావాలన్నది ‘నీతి ఆయోగ్‌’ అంచనా. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ సజావుగా అమలయ్యేందుకు చిన్న పట్టణాల్లో సుమారు రెండున్నరవేల ఆధునిక ఆస్పత్రులు నెలకొల్పాల్సి ఉందని ఏడెనిమిది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి వెయ్యిమంది జనాభాలో కనీసం ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. కానీ... కనీసం ఏడున్నర లక్షల మందికి కొరత ఉన్నట్లు అంచనా. దేశంలో 20 లక్షలమంది వైద్యులు, 40 లక్షల మంది నర్సుల్ని అదనంగా నియమించాలని ఆరోగ్య భారత్‌ నివేదిక’ చెబుతోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరచి భవిష్యత్​కు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి, భారీగా బడ్జెట్​ కేటాయింపులు జరిపితే ఆరోగ్య భారత్​ సాకారమయ్యే దిశగా అడుగులు వేసినట్లే...!

ఇదీ చూడండి : మోదీ అధ్యక్షతన రెండు కేబినెట్​ కమిటీలు

ABOUT THE AUTHOR

...view details