ఉత్తరప్రదేశ్ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి నేత్‌రామ్‌కు చెందిన రూ.225 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు జప్తు చేశారు. దిల్లీ, ముంబై, నొయిడా, కోల్‌కతాల్లోని స్థిరాస్తులు, మూడు విలాసవంతమైన కార్లు జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మార్చి 13న ఐటీ సోదాలు
ఈ నెల 13న ఉత్తరప్రదేశ్‌లో నేత్‌రామ్‌కు చెందిన ఆస్తులపై 12 చోట్ల ఆదాయపన్నుశాఖ సోదాలు చేసింది. నేత్‌రామ్ రూ.300 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన మౌంట్ బ్లాంక్ పెన్నులను స్వాధీనం చేసుకున్నారు. రూ.95 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపిన 30 డొల్ల కంపెనీలను గుర్తించారు. ఈ నల్లధనంతో దిల్లీ, ముంబయి, కోల్‌కతాలో నేత్‌రామ్ ఆరు విలాసవంతమైన ఇళ్లు కొన్నట్లు ఇదివరకే ఐటీ శాఖ ప్రకటించింది.
1979 బ్యాచ్‌కు చెందిన నేత్‌రామ్ 2002-03 మధ్య అప్పటి యూపీ ముఖ్యమంత్రి మాయావతి వద్ద కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీకే చెందిన ఓ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఐటీ అధికారులు తెలిపారు.