తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది దాటితే చాలు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. పగటి వేళల్లో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. భానుడి సెగల తాకిడికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటివేళల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు జనంలేక వెలవెలబోతున్నాయి. 45 నుంచి 46 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసర పనులుంటే తప్పితే జనం బయటకు రావడంలేదు. ఒకవేళ రావాల్సిన పరిస్థితే వస్తే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తగు జాగ్రత్తలత్తో బయటకు వస్తున్నారు. ఎండ తీవ్రతతో ప్రజల దాహార్తి తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి.
మరో మూడు రోజులపాటు..
రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు వీచే వరకు వీటి ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల వల్ల మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.