ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆధార్, ఇతర వ్యక్తిగత వివరాలు చౌర్యం చేశారన్న కేసులో అశోక్‌కు ధర్మాసనం పలు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. విచారణకు ప్రతిరోజూ పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. మాదాపూర్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఐటీగ్రిడ్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఇతర వ్యక్తిగత డేటా చోరీ చేసిందని మాదాపూర్, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌కు హైకోర్టులో ఊరట! - ఐటీ గ్రిడ్స్
ఐటీగ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌కు పలు షరతులతో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ కోర్టుకు అప్పగించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ధర్మాసనం షరతులు విధించింది.
ఐటీగ్రిడ్స్‌కు సంబంధించిన కేసులన్నీ కలిపి విచారణ జరిపేందుకు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటయింది. తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని అశోక్ వాదించారు. అశోక్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని... ఇప్పటికే విచారణకు సహకరించడం లేదని నోటీసులు ఇచ్చినా.. స్పందించడం లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. అశోక్‌కు పలు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ చూడండి: అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ గుడ్‌బై