తెలంగాణ

telangana

ETV Bharat / briefs

గోదావరి జలాల తరలింపుపై కొనసాగుతున్న కసరత్తు - JAGAN

గోదావరి జలాల తరలింపు అంశంపై తెలుగు రాష్ట్రాల ఇంజినీర్ల కసరత్తు కొనసాగుతోంది. సాగర్, శ్రీశైలానికి జలాల తరలింపు కోసం ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీల కసరత్తు ఓ కొలిక్కి వచ్చాక ఉమ్మడి భేటీ జరగనుంది.

గోదావరి జలాల తరలింపుపై కొనసాగుతున్న కసరత్తు

By

Published : Jul 3, 2019, 5:13 AM IST

Updated : Jul 3, 2019, 7:43 AM IST

గోదావరి జలాల తరలింపుపై కొనసాగుతున్న కసరత్తు

సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను నీటి లభ్యత తక్కువగా ఉన్న కృష్ణా నది జలాశయాల్లోకి తరలించాలన్న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ నిర్ణయానికి అనుగుణంగా ఇంజినీర్ల కసరత్తు కొనసాగుతోంది. ఈ విషయమై ప్రతిపాదనలు రూపొందించేందుకు ఇరు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఇంజినీర్లు, నిపుణుల కమిటీ సభ్యులు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. గోదావరి నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలకు రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీరు తరలించేందుకు వివిధ రకాల ప్రతిపాదనలను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి గోదావరి నీటి తరలింపుపై తెలంగాణ ఇంజినీర్ల కమిటీ మంగళవారం సుదీర్ఘంగా చర్చించింది. ఇంజినీర్ ఇన్ చీఫ్​తో పాటు సంబంధిత సీఈ, ఎస్ఈలు, విశ్రాంత ఇంజినీర్లు ప్రతిపాదనలపై అధ్యయనం చేశారు.

శ్రీశైలానికి తుపాకులగూడెం సమీపం నుంచి నీరు తరలింపు ప్రతిపాదనలను పరిశీలించారు. ఈ క్రమంలో నీటి లభ్యత, ఎత్తు, తదితర అంశాలపై అధ్యయనం చేశారు. దాదాపు 400 కిలోమీటర్ల మేర జలాలను తరలించాల్సి ఉంటుందని... మధ్యలో సొరంగాలు కూడా నిర్మించాల్సి ఉంటుందని, దీనికయ్యే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయని ఇంజినీర్లు అంచనా వేశారు. రాంపూర్, ఇతర ప్రాంతాల నుంచి జలాల తరలింపు ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించారు. కమిటీ ఇవాళ కూడా కసరత్తు చేయనుంది. సాగర్​కు దుమ్ముగూడెం లేదా పోలవరం నుంచి జలాల తరలింపు ప్రతిపాదనలపై ఇవాళ అధ్యయనం చేస్తారు. ముందు అనుకున్న ప్రకారం నేడు ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీల ఉమ్మడి సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ... ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల కమిటీల కసరత్తు పూర్తి కానందున భేటీ వాయిదా పడింది. కసరత్తు పూర్తైన వెంటనే రెండు కమిటీల ఉమ్మడి సమావేశం జరగనుంది. భేటీలో గోదావరి జలాల తరలింపు ప్రతిపాదనలపై చర్చించి ఓ అభిప్రాయానికి వస్తారు. ఈ నెల 15లోగా కమిటీలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదిక అందించనున్నాయి.

ఇవీ చూడండి: నాచారం ఐడీఏలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి

Last Updated : Jul 3, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details