హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణదారులపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. కఠిన నిబంధనలు తీసుకువచ్చి.... అక్రమ నిర్మాణాలను నిలిపివేసేందుకు కసరత్తు చేస్తోంది. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, శిథిల భవనాల తొలగింపుపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ దానకిశోర్ సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల సంఖ్య తీవ్ర సమస్యగా మారిందన్నారు. దీనికి చట్టంపట్ల అక్రమ నిర్మాణ దారుల్లో భయం లేకపోవడం, అధికారుల అలసత్వం ప్రధాన కారణమని కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. ఇక నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. వాటికి అయ్యే వ్యయాన్ని కూడా సంబంధిత అక్రమ నిర్మాణదారుల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశం జీహెచ్ఎంసీ చట్టంలోనూ ఉన్నా... ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఈ విషయంలో చదరపు అడుగుకు వర్తింపజేసే అపరాదరుసం, ప్రత్యేక ఖాతా, చట్టపరమైన అంశాలతో కూడిన ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నట్టు స్పష్టం చేశారు.
అక్రమ నిర్మాణదారులపైనే కూల్చివేత వ్యయం - ghmc on illegal constructions
గ్రేటర్లో అక్రమ నిర్మాణాలపై కఠిన వైఖరి అవలభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా గ్రేటర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సంబంధిత నిర్మాణ దారుల నుంచే వసూలు చేయాలని బల్దియా సూత్రప్రాయంగా నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ పై వివిధ న్యాయస్థానాల్లో 5 వేల 160కి పైగా కేసులు ఉండగా వీటిలో దాదాపు 4 వేలకు పైగా పట్టణా ప్రణాళిక విభాగానికి చెందినవే ఉన్నాయని దానకిశోర్ వివరించారు. అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం... లీగల్ కేసుల పట్ల సకాలంలో స్పందించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. లీగల్ అంశాలు, కోర్టులో వాజ్యాల దాఖలు, కౌంటర్లను వేయడం తదితర అంశాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బందికి త్వరలోనే ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నట్టు కమిషనర్ ప్రకటించారు. టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించి నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాల గుర్తింపు, నోటీసుల జారీ, భవన నిర్మాణాల్లో అతిక్రమణలు, క్షేత్రస్థాయిలో నిర్మాణ వాస్తవ పరిస్థితులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఈ యాప్‌ను నిర్వహించడానికి టౌన్‌ప్లానింగ్ అధికారులందరికీ ప్రత్యేకంగా ట్యాబ్‌లను అందజేస్తున్నామని కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండిః ఇష్టం మనది.. కష్టం నాన్నది