ఇటీవల అటవీశాఖ అధికారులపై వరుస దాడులు జరుగుతున్నందున ఉద్యోగులకు ఆయుధాలు కావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆయుధాలు లేకపోవడం వల్లే తమపై దాడులకు పాల్పడుతున్నారని అటవీ శాఖ సిబ్బంది వాపోతున్నారు. అడవుల్లోకి వెళ్లిన సమయంలో పోలీసులు వెంట ఉన్నా, వారి చేతుల్లో ఆయుధాలున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ... కొత్త సార్సాలా ఘటనను ఉదహరిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందిని గతంలో మావోయిస్టులు, స్మగ్లర్లు దాడులు చేసి పొట్టనపెట్టుకున్న ఉదంతాలను గుర్తుచేస్తున్నారు. గత అనుభవాలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితుల్ని ఉన్నతాధికారులు బేరీజు వేస్తున్నారు.
ఆయుధాలు ఉన్నా సమస్యే..
అటవీ ఉద్యోగులకు ఆయుధం కత్తికి రెండువైపులా పదునులాంటిది. ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు సమస్య మరింత పెరగొచ్చు. ఇప్పుడు కర్రలతోనే దాడులు జరుగుతున్నాయి. అటవీ ఉద్యోగుల వద్ద ఆయుధాలు వారూ ఎదురదాడికి దిగి మరిన్ని సమస్యలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. దాడులు చేసేవారు వ్యవహరించే తీరు ఇంకా తీవ్రంగా ఉండే పరిస్థితి నెలకొంటుంది. కొందరు అటవీ అధికారులు కాల్పులు జరిపి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. జైలుకు వెళ్లిన ఘటనలు అనేకమని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అవసరంమైన సందర్భాల్లో రక్షణగా వెళ్తున్న పోలీసులు ఘర్షణలు తలెత్తినప్పుడు క్రియాశీలంగా వ్యవహరించాలని అధికారులు అభిప్రాయపడ్డారు.