పలు విమాన సేవలు రద్దు చేయటంపై జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పౌర విమానయాన డెరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు లేఖ రాసింది జెట్ ఎయిర్వేస్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోషియేషన్(జేఏఎమ్ఈడబ్ల్యూఏ). ఇది తమ జీతభత్యాలతో పాటు విమానాలు, ప్రయాణికుల భద్రతపైనా ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
"ఈ నిర్ణయం మా ఆర్థిక అవసరాలకు ఇబ్బందులు తెస్తుంది. ఆ మానసిక ఆందోళన పనిపై ప్రభావం చూపుతుంది. సరైన మానసిక స్థితితో పని చేయకపోతే పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఫలితంగా ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే మాకు మూడు నెలల జీతం సంస్థ బకాయి పడింది. డిసెంబర్ నుంచి మా జీతాలను నిలిపివేశారు. మీరు(డీజీసీఏ) జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి."
-లేఖలో జెట్ ఎయిర్వేస్ ఇంజినీర్స్ అసోసియేషన్