జన్మనిచ్చేది అమ్మ అయితే... బతుకునిచ్చేది నాన్న...!
నడక నేర్పేది అమ్మ అయితే... నడత నేర్పేది నాన్న...!
ఇష్టాయిష్టాలు పంచుకునేది అమ్మతో అయితే... మన ఇష్టాలు నేరవేర్చేది మాత్రం నాన్నే...!
గొరుముద్దలతో కడుపు నింపేది అమ్మ అయితే... ఆ ముద్ద కోసం శ్రమించేది నాన్న...!
మనం సుఖంగా నిద్రపోయేందుకు తాను కునుకు లేకుండా కష్టపడే కార్మికుడే నాన్న...!
తాను చేసే కష్టం మన దరికి చేరకూడదని ప్రతీక్షణం తపించే వాడు నాన్న...!
కళ్లలోని ప్రేమను గుండెలోనే దాచుకునే అమాయక చక్రవర్తి నాన్న...!
పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని తన సర్వస్వాన్ని దారపోసే స్వార్థపరుడు నాన్న...!
కరుకుగా మాట్లాడినా... కఠినంగా వ్యవహరించినా... నిత్యం నా క్షేమం కోరుకునే నాన్నే నా హీరో...!
కుటుంబ నావికుడిగా...
అవును... నాన్న ప్రతీ ఒక్కరి జీవితంలో రియల్ హీరో... మనం ఈ లోకంలోకి వచ్చింది మొదలు... తాను ఈ లోకం విడిచి వెళ్లేవరకు... మన సుఖం కోసం ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఏకైక వ్యక్తి నాన్న. తన పిల్లల దృష్టిలో తానొక హీరోలా ఉండాలనేది ఆయన కోరిక. దాని కోసం ఎన్ని కష్టాలొచ్చినా ముఖంలో ఆ బాధను చూపించకుండా కుటుంబాన్ని నడిపించే నావికుడవుతాడు నాన్న.
రెండు తగిలించి మరీ...
చిన్నప్పుడు అమ్మతోనే అన్నీ నేర్చుకుంటాం... ఎందుకంటే మనకు బతుకిచ్చేందుకు నాన్న సమాజంతో పోరాడుతూ బిజీగా ఉంటాడు కాబట్టి. నడక నేర్చుకునేటప్పుడు అడుగులు తడబడుతుంటే అమ్మ సరిచేస్తుంది. అదే పెద్దయ్యాక తడబడితే... నాన్న రెండు తగిలిస్తాడు. ఎందుకంటే తన పిల్లలు సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు... మరి అదే సమాజం వేలెత్తి చూపిస్తే ఎలా తట్టుకుంటాడు. అందుకే కొంచెం కఠువుగా చెప్తాడు!