ఉగ్రవాదులకు నిధులు అందకుండా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పేర్కొంది. అక్టోబర్ నాటికి ఈ కార్యాచరణను పూర్తి చేయాలని... లేకపోతే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాల్సి వస్తుందని పాకిస్థాన్‌తో పాటు ఇరాన్‌నూ హెచ్చరించింది.
పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్.... ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా, అక్రమ నగదు చలామణిని అరికట్టడానికి కృషి చేస్తోంది. దేశంలో నిషిద్ధ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను పాకిస్థాన్ గుర్తించి అరికట్టాలని సూచించింది.
అక్టోబర్ వరకు గడువు
ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహం, అక్రమ నగదు చలామణి సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన పటిష్ఠ చట్టాలు లేని దేశాలను గ్రే లిస్ట్‌లో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. ఆ జాబితాలో పాకిస్థాన్‌ను కూడా గత ఏడాది చేర్చింది ఈ అంతర్జాతీయ సంస్థ.