ఈవీఎంల మొరాయింపులు, పోలింగ్ బహిష్కరణల నడుమ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా చోట్ల సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించాయి. ఈ కారణంగా అరగంట నుంచి గంటపాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఓటేసిన ప్రముఖులు...
ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లాలో, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో ఓటేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో, మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గద్వాలలో, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి రాములు అచ్చంపేటలో ఓటు వేశారు. మల్కాజిగిరి అభ్యర్థి రేవంత్‌రెడ్డి కొండారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.
విషాదం నుంచి తేరుకోని తీలేరు..
నారాయణపేట జిల్లా తీలేరు గ్రామస్థులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బుధవారం రోజు 10 మంది కూలీలు మరణించిన ఘటన నుంచి వారు ఇంకా తేరుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు.
మేము ఎందుకు ఓటేయాలి?
మహబూబ్‌నగర్ జిల్లా ఉదండాపూర్‌లో జలాశయ నిర్వాసితులు తమను పట్టించుకోలేదని పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. అదే జిల్లాలోని బూరెడ్డిపల్లిలో తమ గ్రామాన్ని బాదేపల్లి మున్సిపాలిటీలో కలపడాన్ని నిరసిస్తూ.. ఓటింగ్‌ను అడ్డుకున్నారు. ఆమనగల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించనందుకు నిరసనగా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. వడ్డేపల్లి జక్కిరెడ్డిపల్లి గ్రామంలో ఓట్లు గల్లంతయ్యాయని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్క తేలే వరకు పోలింగ్ జరగనివ్వమని అడ్డుకున్నారు.