తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈ సీటు యమా హాటు - khammam congress

కాంగ్రెస్ తరఫున శాసనసభకు పోటీ చేసేందుకు ఐదువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అభ్యర్థులే కరవయ్యారు. కానీ ఒక్కస్థానంలో మాత్రం రాష్ట్రమంతా వచ్చిన దరఖాస్తులతో సమానంగా వచ్చాయి.

ఖమ్మం లోక్​సభ స్థానానికి పొటాపోటీ

By

Published : Mar 5, 2019, 10:10 PM IST

Updated : Mar 5, 2019, 11:14 PM IST

ఖమ్మం లోక్​సభ స్థానానికి పొటాపోటీ
శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయం, పార్టీలో గ్రూపు రాజకీయాలు, నేతల మధ్య అనైక్యత, ఫిరాయింపులతో సతమవుతున్న కాంగ్రెస్... లోక్​సభ పోరుకు సన్నద్ధమవుతోంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తలచుకొని ఎంపీగా పోటీ చేసేందుకు నేతలు జంకుతున్నారు. కానీ ఒక్క స్థానంలో మాత్రం జిల్లా ఎల్లలు దాటి మరీ... పోటీకి సై అంటున్నారు. అదే ఖమ్మం లోక్​సభ నియోజకవర్గం.

అందుకే క్రేజ్...

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పరువు, తెదేపా ఉనికి చాటిన జిల్లా ఖమ్మం. పది స్థానాల్లో ప్రజాకూటమి 8 గెలిచి అధికార తెరాసకు జలకిచ్చింది. గులాబీ హావాలోనూ ఎక్కువ స్థానాలు గెలిచిన జిల్లాగా నిలిచింది. ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల నేతలు ఇక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాతో సంబంధం లేని వీహెచ్, రేవంత్ వంటి సీనియర్ నేతలు కూడా ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఫలితాలతో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన హస్తం పార్టీ... గత అనుభవాల దృష్ట్యా... ఈసారి ముందే మేల్కొని అభ్యర్థులను అన్వేషిస్తోంది. పీసీసీ వరస భేటీలే కాకుండా... నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. పోటీకి ఆసక్తి ఉన్నవారిని దరఖాస్తు చేసుకోవాలని కోరగా... 17 స్థానాల్లో కేవలం ఒక్క ఖమ్మం నుంచే 17మంది అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుండటం గమనార్హం. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 5చోట్ల కూటమి ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల క్రేజ్ పెరిగింది. అర్థ, అంగ బలమున్న నేతలు టికెట్ కోసం దిల్లీ, హైదరాబాద్ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎవరైతే బాగుంటది...

17 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ... ప్రధానంగా జిల్లాకు చెందిన నేతల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, సీనియర్ నాయకులు పోట్ల నాగేశ్వర రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్​తోపాటు తెదేపా నేత నామా నాగేశ్వర రావును జోడించి కార్యకర్తలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది పీసీసీ. ఐదుగురు ఆశావహులతో జాబితా పంపాలని డీసీసీని కోరగా... దరఖాస్తు చేసుకున్నవారిలో ఎవరైనా.. అభ్యంతరం లేదని పేర్కొంది.

ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లా కాకుండా... పార్లమెంటు అభ్యర్థుల్ని త్వరగా ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం ఉంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చూడండి:'పట్టభద్రుల' పోరు

Last Updated : Mar 5, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details