సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి మోదీ జీవితంగా ఆధారంగా రూపొందిన ' పీఎం నరేంద్ర మోదీ' చిత్రాన్ని ఎన్నికల సంఘం అధికారులు బుధవారం వీక్షించారు. సినిమా చూసి నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సోమవారం తీర్పునిచ్చింది. ఇదే విషయమై ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని నిర్మాతలను కోరింది ఎన్నికల పరిశీలనా బృందం. సినిమా చూసిన అనంతరం సుదీర్ఘంగా అధికారులు చర్చించారని సమాచారం. చర్చల సారాంశాన్ని ఈ నెల 19న సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో అందజేయనుంది.
ఎన్నికల వేళ ఎలాంటి బయోపిక్‌లకు అవకాశం లేదని సినిమాపై ఈనెల 10న నిషేధం విధించింది ఈసీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి సినిమా చూడకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.