రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది.
ఆజంఖాన్‌పై ఈసీ ప్రచార నిషేధం విధించడం ఇది రెండోసారి. భాజపా ఎంపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘం మొదటిసారి ఆయన ప్రచారంపై 72 గంటల నిషేధం విధించింది.
తాజాగా మరోసారి రెండు రోజులపాటు నిషేధం విధించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ప్రజలను బెదిరింపులకు గురిచేయడం వంటి చర్యలతో ఆజంఖాన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. అయితే ఆయన జిల్లా ఎన్నికల యంత్రాంగంపై ఎక్కడ విమర్శలు చేశారో మాత్రం ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
తాజా నిషేధం బుధవారం ఉదయం 6 గంటల నుంచి 48గంట పాటు ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించడం, మీడియాకు ప్రకటనలు ఇవ్వకూడదు.