మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ గురుగోవింద్ కాలనీవాసుల పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఇళ్ళ ముందు నుంచి పొంగుతున్న డ్రైనేజీ నీరు ఆ కాలనీవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాలనీ ఏర్పడి 16 ఏళ్ళు పూర్తయినా.... ప్రారంభం నాడు ఏర్పాటు చేసిన డ్రైనేజీ లైన్లు, రహదారులతోనే కాలం వెళ్లదీస్తున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పెరగాల్సిన చిన్నారుల బాల్యం... మురుగు నీరు, అంటు వ్యాధుల మధ్య నలిగిపోవాల్సిందేనా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మురుగు నీటిలోనే జీవనం.. అంటువ్యాధులతోనే సహజీవనం - Seasonal Diseases
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటే చాలు అనుకుంటుంటే.. ఆ కాలనీవాసులు మాత్రం 365 రోజులు మురుగు నీరు, అంటువ్యాధులతో సహజీవనం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ గురుగోవింద్ కాలనీలో ఈ దుర్భర పరిస్థితి నెలకొంది. అభివృద్ధిలో మేటిగా చెప్పుకునే కూకట్పల్లిలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మురుగు నీటిలోనే జీవనం.. అంటువ్యాధులతో సహజీవనం
నాలుగు వందలకు పైగా కుటుంబాలు నివాసముంటున్న కాలనీపై వివక్ష ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లుగా తాము డ్రైనేజీ సమస్యలతో అవస్థలు పడుతున్నామని... నాయకులు, అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్న తమ సమస్యకు పరిష్కారం జరగలేదని స్థానికులు వాపోతున్నారు. చిన్నాచితకా పనులు చేసుకుని బతికే తాము... సంపాదనంతా పిల్లలకు వచ్చే రోగాలకు ఖర్చు చేయాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ కాలనీకి డ్రైనేజీ సమస్య నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు.