అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించనున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి హెచ్చరికలు జారీ చేసింది ఉత్తరకొరియా. ఇరుదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను సంయుక్త విన్యాసాలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆక్షేపించింది. అణు నిరాయుధీకరణపై ఏడాది ముగిసే లోగా చర్చలకు రావాలన్న తమ నేత కిమ్ జోంగ్ ఉన్ ప్రతిపాదనను లెక్కచేయకపోతే అమెరికా అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని.. అత్యంత బాధను అనుభవిస్తారని వ్యాఖ్యానించింది.
తమను యుద్ధానికి సిద్ధం చేసే విధంగా అమెరికా కవ్వింపు చర్యలకు దిగుతోందని ఉత్తర కొరియా జాతీయ వ్యవహారాల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు 2016 లో ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు కిమ్.
అణు నిరాయుధీకరణ చర్చలపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలోనే దక్షిణ కొరియాతో అగ్రరాజ్య సంయుక్త విన్యాసాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది కిమ్దేశం. తాము విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో.. ఇరుదేశాలకు ఆమోదమయ్యే రీతిలో ఒప్పందాన్ని రూపొందించడంపై ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రకటన విడుదల చేసిందని సమాచారం. ఇందుకోసం క్షిపణి పరీక్షలనూ వేగవంతం చేసింది.