ఎమోటెట్ ట్రోజన్ వైరస్.. సైబర్ నేరాల్లో ఒకటైన ఈ వైరస్ ఎంతో ప్రమాదకరం. ఎక్కువగా స్పాం మెయిళ్ల ద్వారా యూజర్లను బుట్టలో వేసుకుంటారు నేరగాళ్లు. ఒక్కసారి క్లిక్ చేస్తే ఇక అంతే. తర్వాత బాధ పడడం తప్ప ఇంకేం చేయలేం. మన ఆర్థిక, వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారమంతా క్షణాల్లో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లే. ఇప్పుడు దీని గురించి ఎందుకు అనుకుంటున్నారా?
సైబర్ క్రిమినల్స్ దీనిని విస్తృతంగా ప్రయోగిస్తున్నారు మరి. ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంటే.. ఇదే అదనుగా విరుచుకుపడుతున్నారు. ట్రోజన్ వైరస్‌ను స్పాం మెయిళ్ల ద్వారా కంప్యూటర్లలోకి పంపించి.. విలువైన, సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఐబీఎం-ఎక్స్ ఫోర్స్ పరిశోధనలో ఈ గుట్టు బయటపడింది.
మొత్తం కరోనా చుట్టూనే...
కరోనా వైరస్‌ను కేంద్రంగా చేసుకునే.. ఈ చర్యకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వైరస్ సంక్రమణ, నివారణ చర్యలంటూ మోసపూరిత మెయిళ్లు పంపుతున్నట్లు ఐబీఎం ఎక్స్-ఫోర్స్ గమనించింది. అయితే.. ఎక్కువగా జపాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడుతున్నట్లు సమాచారం.
ఎమోటెట్ అనేది ఒక ట్రోజన్ వైరస్. కంటెంట్ ఆకర్షించే విధంగా వినియోగదారులను ఒక నిర్దిష్ట వెబ్ పేజీ లింక్‌పై క్లిక్ చేయమని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. బ్రౌజింగ్ ద్వారా సున్నితమైన సమాచారాన్ని సేకరించడం ఎమోటెట్ ప్రధాన విధి.
ఎలా చేరుతుంది..?
ఇది స్పాం మెయిళ్ల ద్వారా వ్యాపిస్తుంది. అయితే.. ఈ వ్యాప్తి ఏ విధంగానైనా జరగొచ్చు. హానికర స్క్రిప్ట్, డాక్యుమెంట్ ఫైళ్లు, ఏదైనా లింక్‌ల ద్వారా కంప్యూటర్లోకి ప్రవేశిస్తుంది. ఇది దాదాపు అన్ని మెయిళ్లలానే కనిపించి మన కళ్లనే మోసం చేస్తుంది.
ఒక్కసారి ట్రోజన్ వైరస్ మీ కంప్యూటర్లోకి చేరితే.. ఆర్థిక, బ్యాంకింగ్ వివరాల్ని సేకరిస్తుంది. ఆ సమాచారం అంతటినీ కేటుగాళ్లకు చేరవేస్తుంది.
ఆ ప్రాంతాలే లక్ష్యం..
ఇలాంటి మెయిళ్లలో ఎక్కువభాగం జపనీస్ భాషలోనే ఉంటున్నాయి. దీనిని బట్టి.. ఆపరేటర్లు ఉద్దేశపూర్వకంగా వ్యాధి వ్యాప్తి చెందే ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మెయిళ్లను ఇట్టే ఆకర్షించేలా రూపొందిస్తారు నేరగాళ్లు. ఇలా చేయడం ద్వారా మరో క్షణం ఆలోచించకుండానే ఆ మెయిల్‌ను తెరిచేందుకు ఆస్కారం ఉంటుంది.
ఉదాహరణకు ఒక మెయిల్‌ను ప్రస్తావించింది ఐబీఎం-ఎక్స్ ఫోర్స్. జపాన్ భాష నుంచి అనువదించి మెయిల్లోని విషయాలను పేర్కొంది.