తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పోటీ చేయాలా? వద్దా? మల్లగుల్లాలు పడుతున్న తెతెదేపా - ravula

పార్లమెంట్​ ఎన్నికల్లో బరిలో దిగాలా... వద్దా అనే విషయంలో తెతెదేపా ఎటూ తేల్చుకోలేకపోతోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే... సైకిల్ మాత్రం కదలట్లేదు. కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా పోటీ చేయాలని తెదేపా నేతలు యోచిస్తున్నారు.

బరిలో దిగాలా... వద్దా

By

Published : Mar 24, 2019, 6:58 AM IST

బరిలో దిగాలా... వద్దా?
లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయాలా... వద్దా అనే అంశంపై తెతెదేపా తర్జనభర్జన పడుతోంది. ఒకవేళ బరిలోకి దిగితే తెరాస, భాజపాలకు మేలు జరుగుతుందని... అది జరగకుండా అడ్డుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసలు పోటీ చేయకపోవడమే మేలని కొందరు నేతలు సూచించినట్లు తెలుస్తోంది.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​తో తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ సీనియర్ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, రేవూరి ప్రకాశ్​రెడ్డి శనివారం ఓ హోటల్​లో భేటీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

మద్దతివ్వండి..

పార్లమెంట్ ఎన్నికల్లో తెదేపా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం ఉత్తమ్​ అడిగినట్లు సమాచారం. ఆదివారం నిర్ణయించి చెబుతామని రమణ సమాధానమిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ బరిలో దిగితే తెతెదేపా పోటీ చేసే స్థానాలు కాకుండా మిగతా చోట్ల కాంగ్రెస్​కు మద్దతివ్వాలని ఉత్తమ్​ కోరగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.

బరిలో దిగకుంటే సంయుక్త పోరాటం..

ఒకవేళ ఎన్నికల బరిలో దిగకుంటే ఇరుపార్టీలు కలిసి తెరాస, భాజపాలపై సంయుక్తంగా పోరాడాలని నిర్ణయించినట్లు సమాచారం. పోటీ చేయకుంటే శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడుతుందని... కనీసం 3 లేదా 5 స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని తెదేపా నేతలు భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సీపీఐ కూడా తెదేపా మద్దతు కోరుతోంది.

ఇవీ చూడండి:నిజాంపేట్​లో ఇంజినీరింగ్ బస్సు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details