ఎన్నికలు పారదర్శకంగా జరగాలన్న సంకల్పంతోనే ఈవీఎంల విధానాన్ని అమల్లోకి తెస్తే మోదీ, కేసీఆర్ లాంటి నేతలు వాటిని ట్యాంపరింగ్ చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ సమీపంలో చేవెళ్ల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. మోదీ దేశ నియంత అయితే కేసీఆర్ రాష్ట్ర నియంత అని అభివర్ణించారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌దే గెలుపు
పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ భాజపాల మధ్యనే జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథి విజయశాంతి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా అన్ని విధాల ప్రజల నడ్డి విరగ్గొట్టిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు పైనే ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాత్రంతా మద్యం సేవించి 11వ తేదీన ఓటు వేయకుండా నిద్రపోయే వారిని కర్రతో బాదుతానని విజయశాంతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు.
సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, దాసోజు శ్రవణ్‌కుమార్, తెజస అధినేత కోదండరాం, మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, షబ్బీర్ అలీ, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, ఇతర ముఖ్య నేతలు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. సభ విజయవంతం కావటం పట్ల హస్తం నేతలు జోష్ మీదున్నారు.
వికారాబాద్‌జిల్లాలో చేవెళ్ల ఆత్మగౌరవ సభ ఇదీ చదవండి: తెరాస వచ్చాకే చిల్లర రాజకీయాలు షురూ: సంపత్