సీఎల్పీని రాజ్యంగ విరుద్ధంగా తెరాస శాసనసభ పక్షంలో విలీనం చేశారంటూ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. విలీనం చేస్తూ జారీ చేసిన బులెటిన్‌ను కొట్టివేయాలని కోరుతూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క పిటిషన్ దాఖలు చేశారు. పార్టీలు, శాసనసభ పక్షాల విలీనం ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని... స్పీకర్‌కు సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభాపతి తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఆరోపించారు. ఒకవేళ విలీనం చేస్తే ముందుగా తమకు నోటీసు ఇవ్వాలని కోరినప్పటికీ... స్పీకర్ పట్టించుకోలేదన్నారు. విలీనాన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. తెరాసఎల్పీలో సీఎల్పీ విలీనం కాబోతున్నదని ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, రేగా కాంతారావు మీడియా సమావేశంలో ముందుగానే చెప్పారని... దానిని బట్టి తెరాస, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముందుగానే ప్రణాళిక చేసినట్లు తెలుస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.