తెలంగాణ

telangana

పది స్థానాల్లో విజయం తథ్యం: కాంగ్రెస్​

By

Published : Apr 12, 2019, 5:30 AM IST

Updated : Apr 12, 2019, 7:36 AM IST

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఆశావహ ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది. పది స్థానాలను తాము కైవసం చేసుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. పోలింగ్‌ ముగిసిన తరువాత అభ్యర్థులతో, ఇతర నేతలతో సంప్రదింపులు జరిపిన తరువాతనే ఈ ప్రకటన చేసిన కాంగ్రెస్‌ ఇవాళ గాంధీభవన్‌లో కోర్‌కమిటీ సమావేశం కానుంది.

గెలుపు జెండా ఎగరేస్తామంటున్న కాంగ్రెస్​ నేతలు

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ​ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణలోని 17 లోక్​సభ నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో హస్తం హవా ఉండబోతోందని అంచనా వేస్తోంది. తెరాస బరిలోకి దింపిన అభ్యర్ధులు రాజకీయ అనుభవం లేని వారు కావడం వల్ల కాంగ్రెస్​కు గట్టి పోటీ ఇవ్వలేకపోయారని పార్టీ అంచనా వేస్తోంది.

ఓటర్లను ప్రభావితం చేశామని నేతల ధీమా

ఈ ఎన్నికలు ప్రధాన మంత్రిని నిర్ణయించేవి కావడంతో ప్రాంతీయ పార్టీకి సంబంధం లేదని.. గెలిచినా... ఓడినా కేసీఆర్‌ కుర్చీ అయితే పోదన్న విషయాన్ని ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా ప్రచారం చేశారు. మరో వైపు గతంలోనూ 16 స్థానాలు ఉన్నా...ఏమీ సాధించలేదని నిలదీస్తూ వచ్చారు. వీటికి తోడు కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో మహిళలకు రాజకీయ రిజర్వేషన్‌లు కల్పిస్తామని ప్రకటించడం, కనీస ఆదాయ పథకం లాంటివి ఓటర్లను ప్రభావితం చేశాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.
తెరాస, భాజపాయేతర పార్టీలను, ప్రజా సంఘాలను కూడగట్టుకుని ముందుకు వెళ్లడంలో నేతలు సఫలం అయినట్లు పార్టీ భావిస్తోంది. పోలింగ్‌ సమయంలో పోల్‌ మేనేజ్‌మెంటును జాగ్రత్తగా నిర్వహించడం కూడా క్షేత్ర స్థాయిలో పని చేసినట్లు కాంగ్రెస్‌ భావిస్తోంది.

నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్​ కోర్​కమిటీ సమావేశం

ఎన్నికలు పూర్తైన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా అభ్యర్థులతో మాట్లాడిన అనంతరం పది స్థానాల్లో తాము గెలుస్తామని మీడియా ముందు ప్రకటించారు. పోలింగ్‌ సరళి తమ పార్టీకి అనుకూలంగా ఉందని... కాంగ్రెస్‌ నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, పెద్దపల్లి, భువనగిరి, కరీంనగర్‌, వరంగల్‌ నియోజకవర్గాలు గెలిచే అవకాశాలు మొండుగా ఉన్నాయని లెక్కలు కడుతోంది. ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదు కావడం తమకు అనుకూలమైన ఫలితాలు తథ్యమని స్పష్టం చేస్తోంది. ఇవాళ గాంధీ భవన్‌లో కోర్‌కమిటీ సమావేశంలో ఎన్నికల సరళిపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

గెలుపు జెండా ఎగరేస్తామంటున్న కాంగ్రెస్​ నేతలు

ఇవీ చూడండి: ఈసీ వైఫల్యంతోనే పోలింగ్ శాతం తగ్గింది : కుంతియా

Last Updated : Apr 12, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details