రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహాన్ని ఖరారు చేసింది. సాయంత్రం ఓ హోటల్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో కోర్ కమిటీ సమావేశమైంది. రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని... ఆయన నాయకత్వం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి అవసరమని కోర్ కమిటీ అభిప్రాయపడింది.
కమిటీ ఏర్పాటు
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. మొత్తం 140 మున్సిపాలిటీలకు ఇంఛార్జీలు, ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు బాధ్యులను నియమించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచందర్ రెడ్డిలతో కమిటీ వేసింది.