పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించి... ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలకు కాంగ్రెస్ ఆచితూచి ముందుకు వెళ్తోంది. అధికార తెరాసలో చేరనున్నట్లు ప్రకటించిన వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, స్పీకర్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలతో రోజు రోజుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఇన్ని రోజులు పార్లమెంటు ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్న రాష్ట్ర నాయకత్వం.. ఎన్నికలు పూర్తవగానే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ప్రక్రియను చేపట్టింది.
సభాపతిని కలిసిన సీఎల్పీ నేత
అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ తప్పనిసరిగా అసెంబ్లీకి వస్తారని భావించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరుగురు ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లు సిద్ధం చేశారు. సభాపతిని కలిసి ఆ శాసనసభ్యులపై ఫిర్యాదు చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.