పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి హాని కలగదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ముమ్మర దర్యాప్తు, రాష్ట్రపతి సిఫార్సులు అందిన తర్వాతే పౌరసత్వం అందిస్తామని గువాహటిలో నిర్వహించిన ర్యాలీలో మోదీ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ప్రధాని.
"ఎన్ఆర్సీతో పాటు నాగరికతకు సంబంధించిన చట్టంపై అసత్యాలు వ్యాపిస్తున్నాయి. దేశాన్ని ఇన్నేళ్లు నాశనం చేసినవారు తమ సొంత లాభాలకోసం వీటిని వ్యాపింపజేస్తున్నారు. అసోం సహా ఈశాన్య భారతీయుల భాష, సంస్కృతి, ఆశలను కాపాడటానికి భాజపా, ఎన్డీఏ సర్కారు అన్ని విధాలుగా కట్టుబడి ఉంది."
---నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
గోపినాథ్ బొర్దొలొయ్, భూపెన్ హజారికలకు భాజపా ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసినవారిని గత ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లు విస్మరించాయని మోదీ ఆరోపించారు.