ఈడీ విచారణకు చిదంబరం హాజరు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు విషయంలో ఆయన అక్రమ నగదు చలామణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
హవాలా నిరోధక చట్టం కింద చిదంబరానికి ఈడీ సమన్లు జారీచేసింది. ఈ ఉదయం 11 గంటలకు విచారణకోసం దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆయన హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమంగా విదేశీ పెట్టబడులు పెట్టడానికి సంబంధించి పలు ప్రశ్నలు వేసి, చిదరంబరం వాంగ్మూలాన్ని నమోదుచేసింది ఈడీ.
ఇదే కేసులో నిందితునిగా ఉన్న చిదంబరం కుమారుడు కార్తీని సైతం నిన్న ఆరుగంటలపాటు ఈడీ విచారించింది. ఆయనను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.
ఏంటీ 'ఐఎన్ఎక్స్' కేసు?
మారిషస్ నుంచి ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడులు వచ్చేలా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)ని ప్రభావితం చేసి ముడుపులు అందుకున్నారని కార్తీపై అభియోగాలు ఉన్నాయి.
చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ హవాలా కేసులో సుమారు రూ.305 కోట్లు చేతులు మారాయని ఈడీ గుర్తించింది. కార్తీ హవాలా ద్వారా రూ.54 కోట్లు విలువైన ఆస్తులు దేశ, విదేశాల్లో కూడబెట్టారని గత సంవత్సరం ఈడీ కేసు నమోదుచేసింది. ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణీ ముఖర్జీపైనా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.