తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న భాజపా... ఎగ్జిట్ పోల్ ఫలితాలను తలకిందులు చేస్తు ఏకంగా తెరాసకు కంచుకోటైన కరీంనగర్‌తో పాటు ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్‌లో విజయ దుందుభి మోగించారు.
పకడ్బందీ వ్యూహాలతో...పాగావేశారు...
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, పోలింగ్ వరకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగింది కమలదళం. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సిట్టింగ్ స్థానాలను కోల్పోయిన కాషాయదళం... పార్లమెంటు ఎన్నికల్లో పట్టుకోసం తొక్కని గడప.. ఎక్కని మెట్టు లేదు. తెరాస, కాంగ్రెస్‌ల నుంచి చివరకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను తమ గూటికి చేర్చుకొని రంగంలోకి దిగింది. మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ, తెరాస లోక్‌సభ పక్షనేత జితేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌కు చెందిన రాపోలు ఆనంద్ భాస్కర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సోయం బాపురావు లాంటి సీనియర్ నేతలు కాషాయగూటికి చేరడం కమలదళానికి కలిసొచ్చింది. ఎన్నడూలేని విధంగా అగ్రనాయకత్వం అంతా తెలంగాణ బాట పట్టారు. సత్తా చాటేందుకు బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక సదస్సులు, సమావేశాలు, సభలు నిర్వహించి... పదునైన మాటలతో కార్యకర్తల్లో జోష్ నింపారు.