తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెరాస కంచుకోట బద్దలు కొట్టిన కమలం - BJP BEAT TRS PLACE

తెరాస కంచుకోట బద్ధలైంది. పార్టీ ఆరంభం నుంచి వెన్నుదన్నుగా ఉన్న కరీంనగర్ వాసులు గులాబీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ లోక్​సభ స్థానాన్ని అనూహ్యంగా కమలం కైవసం చేసుకుంది. భాజపా నుంచి తొలిసారిగా బరిలో ఉన్న బండి సంజయ్ కుమార్​.... తెరాస సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్​పై 90వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

అనూహ్య విజయం...

By

Published : May 23, 2019, 8:52 PM IST

అనూహ్య విజయం...
అధికార పార్టీకి ఊహించని షాక్. గెలుపు ఖాయమన్నుకున్న స్థానంలో అనూహ్య ఓటమి. విజయం నల్లేరుపై నడక అనుకున్న చోట భారీ ఓటమి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ను ముచ్చటగా మూడు సార్లు పార్లమెంట్​కు పంపిన కరీంనగర్​ ప్రజానికం... ఈసారి మాత్రం కారుకు నిరాశే మిగిల్చారు. సిట్టింగ్​ తెరాస ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌పై భాజపా అభ్యర్థి బండి సంజయ్ జయభేరీ మోగించారు.

సానుభూతి కలిసొచ్చింది....

లోక్​సభ బరిలో మొట్టమొదటిసారిగా పోటీలో నిలిచిన బండి సంజయ్ మోదీ జపంతో విజయం సాధించారు. 2014 , 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి గెలుస్తారనే ఆశ మెండుగా ఉన్నా... ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చి ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి కూడా ఒకింత ఈ ఎన్నికల్లో సంజయ్​కి కలిసివచ్చిందనే చెప్పుకోవచ్చు. గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి భాజపా తరఫున విద్యాసాగర్ రావు గెలవడం, హిందూ ధర్మ రక్షణ కోసం పోరాటాలు, నేరెళ్ల బాధితులకు మద్దతుగా చేసిన ఆందోళనలు, యువతరంలో ఉన్న ఆదరణ బండికి ఓట్లు రాలేలా చేశాయి.

కారుకు బ్రేక్​...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మంత్రి ఈటల రాజేందర్​తో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినోద్​కు మద్దతుగా రోడ్ షోలు నిర్వహించారు. కానీ... వినోద్‌కుమార్‌ స్థానికంగా ఉండరన్న విషయాన్ని ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక స్థాయి నాయకులను మాత్రమే గుర్తిస్తారని అపవాదు ఆయనపై ఉండటం అనేది జనాల ఓట్లను చీల్చింది.

మూడో స్థానానికే అంకితం...

తెలంగాణ ఉద్యమంలో తాను పోషించిన పాత్రతో పాటు.. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ భావించారు. ప్రచారంలో వేగం లేకపోవడం, సొంత పార్టీలోనూ కుదరని సఖ్యత, లోక్​సభ పరిధిలో ఒక్కొక్కరుగా నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోవడం వంటి అంశాలతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారనే అంశం స్పష్టమవుతోంది. అందుకే పోటీలో పొన్నం ప్రభాకర్​ మూడో స్థానంతో సరిపుచ్చుకున్నారు.

మొత్తంగా ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్​ మధ్య సాగిన పోటీలో అనూహ్యంగా... కాషాయానికి పట్టం కట్టి కరీంనగర్​ ప్రజానీకం అనూహ్య ఫలితాలిచ్చారు.

ఇవీ చూడండి: తెలంగాణలో గెలిచిన ప్రశ్నించే గొంతుక

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details