తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో విశ్వాసం పోయింది'

ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ దేశ ఆర్థికవ్యవస్థపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్, వాహన రంగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల, చెబుతున్న గణాంకాల పట్ల ప్రజల్లో విశ్వాసం పోయిందని వ్యాఖ్యానించారు.

Banking sector is stressed, govt in no position to bail it out: Abhijit Banerjee
ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో విశ్వాసం పోయింది: అభిజిత్ బెనర్జీ

By

Published : Jan 26, 2020, 10:01 PM IST

Updated : Feb 28, 2020, 1:59 AM IST

భారతదేశంలో బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ సమస్యను పరిష్కరించే స్థితిలో ప్రభుత్వం లేదని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. 13వ జైపుర్ లిటరేచర్ ఫెస్టివల్​లో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"దేశ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే స్థితిలో లేదు. దీనికి భారీ ముల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే దీని గురించి మాట్లాడుతున్నాను."- అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత

నిజాలు చెప్పాలి..!

ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల, గణాంకాల పట్ల ప్రజల్లో విశ్వాసం లేదని, విదేశీ పెట్టుబడిదారులు కూడా ఈ విషయంలో ఆందోళనతో ఉన్నారని అభిజిత్ వ్యాఖ్యానించారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తోందో, ఏం కోరుకుంటుందో అర్థంకావడం లేదని.. దేశంలో పెట్టుబడులు పెరిగి, వృద్ధి పురోగమించాలంటే నిజమైన ఆర్థిక గణాంకాలను ప్రజలముందు ఉంచాలని అభిజిత్ స్పష్టం చేశారు.

విశ్వాసం లేదు..!

'వాహన రంగంలో డిమాండ్ మందగించింది. దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందనే విశ్వాసం ప్రజల్లో లేదు. అందుకే వారు వెనక్కి తగ్గుతున్నారు. ఖర్చు చేయడానికి ఆలోచిస్తున్నారు' అని అభిజిత్ బెనర్జీ అన్నారు.

గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్​ టైమ్స్​

'గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్' రచించిన అభిజిత్​.. భారత్​లో పట్టణ, గ్రామీణ రంగాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశాన్ని మందగమనం పీడిస్తున్నందున... పేదరిక నిర్మూలనపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు.

'పట్టణ రంగం తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టిస్తోంది. గ్రామీణ రంగం పట్టణాలపై ఆధారపడి ఉంది. పట్టణాల నుంచి గ్రామాలకు నిధులు ప్రవహిస్తేనే పేదరిక నిర్మూలన జరుగుతుంది. మందగమనం కారణంగా పట్టణాల్లోని నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి తగ్గిపోయింది. ఇది గ్రామీణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది' అని అభిజిత్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: పౌర నిరసన: 70 లక్షల మందితో 620కి.మీ మానవహారం


Last Updated : Feb 28, 2020, 1:59 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details