"చరిత్రను మార్చే ఎన్నికలివి!".... ప్రచారంలో తరచూ నేతలు చెప్పే మాట. చరిత్రను మార్చే ఎన్నికలకూ.... ఓ చరిత్ర ఉంది. స్వతంత్ర భారతంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలకు, ఇప్పటి ఎన్నికల ప్రక్రియకు ఎంతో వ్యత్యాసం. మధ్యలో ఎన్నో మార్పులు. అన్నింటికీ మూలకారణం ఒకటే... ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేయడం, ఓటింగ్ శాతం పెంచడం.
1951-52లో తొలిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. 15 లోక్‌సభలు ముగిశాయి. 16వ లోక్‌సభ కాలపరిమితికి జూన్ 3 గడువు. 17వ సార్వత్రికానికి షెడ్యూల్ వచ్చేసింది. ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఏప్రిల్ 11న తొలి విడతతో సమరం ప్రారంభమవనుంది.
ఓట్ల పండుగను సమర్థంగా నిర్వహించడం ఎన్నికల యంత్రాంగానికి కత్తి మీద సామే. ఎంత పారదర్శకంగా నిర్వహించాలని చూసినా ఎక్కడో ఒక చోట అక్రమాలు, ఫిర్యాదులు, శాంతి విఘాత చర్యలు... తలనొప్పి తెస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ ముందుకెళ్తోంది ఎన్నికల సంఘం.
ఇందుకోసం ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేస్తోంది. సరికొత్త సాంకేతికతతో ఓటర్ ఫ్రెండ్లీ ఎలక్షన్ల కోసం ఎప్పటికీ కొత్తగా రూపుదిద్దుకుంటూనే ఉంది. ఆ మార్పులేంటో చూద్దాం.
- తొలుత ఓటరు నమోదు వయసు 21గా ఉండేది. కాలక్రమేణా అన్ని విధాలా ఆలోచించి అర్హత వయసును కుదించారు. 21 నుంచి 18 ఏళ్లకు మార్చారు.
- అప్పటి ఎన్నికల్లో అభ్యర్థులు ఒక్కొక్కరికి వేర్వేరుగా బ్యాలెట్ బాక్స్లుండేవి. అనంతరం ఈ ప్రక్రియలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకే బ్యాలెట్ బాక్స్‌తో పోలింగ్ నిర్వహించడం మొదలుపెట్టారు. ఎన్నికల అభ్యర్థి, గుర్తుతో ఒక స్లిప్పును బ్యాలెట్ బాక్స్‌లో వేస్తే సరి.
- ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల వినియోగం మొదటినుంచి ఉండేది కాదు. తొలిసారిగా 1999లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ గుర్తు మెషీన్లో నిక్షిప్తమై తెరపై కనిపిస్తుంది.
- 2010లో ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పిస్తూ బిల్లు తీసుకొచ్చింది. కానీ, ప్రత్యక్షంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలనే నియమముంది.
ఇవీచూడండి:
బ్యాలెట్ బాక్స్ పోయి ఈవీఎంలు వచ్చాయి. పార్టీ అభ్యర్థి, గుర్తులపై ఓటర్లలో కొంచెం స్పష్టత వచ్చినప్పటికీ ఎవరికీ ఓటేశామనేది మాత్రం అంతగా తెలిసేది కాదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, వీవీప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) మెషీన్లు తీసుకొచ్చింది ఈసీ. తొలిసారి 2013 ఆగస్టు 14న నాగాలాండ్ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలో ఓటేయగానే మీరెవరికి ఓటేశారో రశీదు వస్తుంది. ఈవీఎంకు అనుసంధానమై ఉన్న పెట్టెలో పడుతుంది.
- అప్పట్లో ఈవీఎంలపై పార్టీల అభ్యర్థుల పేర్లు, గుర్తులు మాత్రమే ఉండేవి. అనంతర ఎన్నికల పరిణామాలు, ఓటర్ల మనోగతాలు, మారిన రాజకీయాలతో మరో కొత్త ఎంపిక(ఆప్షన్)ను అందుబాటులోకి తెచ్చింది ఈసీ. అదే నోటా(నన్ ఆఫ్ ద ఎబౌ). తొలిసారి 2013 నవంబర్‌లో తీసుకొచ్చారు. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే నోటాపై నొక్కితే చాలు. మీ ఓటు ఏ అభ్యర్థి ఖాతాలోకీ వెళ్లదు.
- తొలుత ఓటు నమోదు క్లిష్టతరంగానే ఉండేది. నిర్ణీత సమయంలో ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందనే నియమనిబంధనలతో చాలా మంది పోలింగ్‌కు దూరమయ్యేవారు. దీనిపై దృష్టిపెట్టిన ఈసీనే స్వయంగా.. ఓటర్లను చైతన్యవంతం చేయడానికి పలు మొబైల్ యాప్‌లు తీసుకొచ్చింది.
- సీ-విజిల్, ఓటర్ ఎడ్యుకేషన్, ఓటర్ హెల్ప్‌లైన్, పీడబ్ల్యూడీ, టోల్‌ఫ్రీ-1950 వంటి యాప్‌లతో ఓటరు నమోదు వివరాలు, మార్పులు, ప్రత్యేక వసతులు, ఫిర్యాదులు, సలహాల స్వీకరణ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాల వీడియోలూ పొందుపరుస్తారు.
వేలిపై సిరా చుక్కను మాత్రం ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.