తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సెరెనా, ఒసాకా ఇంటికి.. ఫెదరర్, జకో ప్రిక్వార్టర్స్​కు - ఆస్ట్రేలియన్ ఓపెన్​లో సెరెనా ఓటమి

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో టాప్ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, ఒసాకా కథ ముగిసింది. మూడో రౌండ్​లోనే వీరిద్దరూ పరాజయం పొంది ఇంటిముఖం పట్టారు. ఫెదరర్, జకోవిచ్ ప్రిక్వార్టర్స్​లోకి దూసుకెళ్లారు.

సెరెనా
సెరెనా

By

Published : Jan 25, 2020, 7:51 AM IST

Updated : Feb 18, 2020, 8:07 AM IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాల మోత. టైటిల్‌ ఫేవరెట్లకు శరాఘాతం. రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌.. టైటిల్‌ నిలబెట్టుకోవాలనుకున్న జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకాలకు చెక్‌. వీళ్ల కథకు మూడో రౌండ్లోనే ముగింపునిస్తూ చైనా క్రీడాకారిణి వాంగ్‌ కియాంగ్‌, 15 ఏళ్ల కొకో గాఫ్‌ సంచలనం సృష్టించారు. పురుషుల సింగిల్స్‌లో సిట్సిపాస్‌ ఇంటి ముఖం పట్టగా.. ఫెదరర్‌ త్రుటిలో పరాజయాన్ని తప్పించుకున్నాడు.

సాఫీగా సాగిపోతున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఐదో రోజు అగ్రశ్రేణి తారలకు షాక్‌ తగిలింది. 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో క్రిస్‌ ఎవర్ట్‌ ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేయాలని ఆశించిన సెరెనా విలియమ్స్‌కు భంగపాటు తప్పలేదు. హోరాహోరీగా సాగిన పోరులో కియాన్‌ వాంగ్‌ 6-4, 6-7 (2-7), 7-5తో ఎనిమిదో సీడ్‌ సెరెనాను మట్టికరిపించింది. 38 ఏళ్ల సెరెనా గత ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో టైటిల్‌ నెగ్గలేకపోయింది.

మరో పోరులో కొకో గాఫ్‌ (అమెరికా) 6-3, 6-4తో మూడో సీడ్‌ ఒసాకాను మట్టికరిపించింది. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన గాఫ్‌ స్పూర్తిదాయక ప్రదర్శన చేసింది. టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌) అలవోకగా ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. మూడో రౌండ్లో బార్టీ 6-3, 6-2తో రిబకినా (కజకిస్థాన్‌)ను చిత్తు చేయగా.. క్విటోవా 6-1, 6-2తో అలెగ్జాండ్రోవా (రష్యా)ను మట్టికరిపించింది.

ప్రిక్వార్టర్స్‌లో జకోవిచ్‌, ఫెదరర్

పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) మూడో రౌండ్‌ను అధిగమించలేకపోయాడు. హోరాహోరీ పోరులో అతడు 5-7, 4-6, 6-7 (2-7)తో రోనిచ్‌ (కెనడా) చేతిలో కంగుతిన్నాడు. ఇక మూడో సీడ్‌ ఫెదరర్‌కు చావు తప్పి కళ్లు లొట్టబోయినంత పనైంది. రసవత్తరంగా సాగిన మూడో రౌండ్లో అతడు 4-6, 7-6 (7-2), 6-4, 4-6, 7-6 (10-8)తో మిల్మన్‌ (బ్రిటన్‌)పై అతికష్టంగా గెలిచాడు. నిర్ణయాత్మక ఐదో సెట్లో, టైబ్రేకర్‌లో 4-8తో వెనుకబడడం వల్ల 38 ఏళ్ల ఫెదరర్‌కు షాక్‌ తప్పదనిపించింది. కానీ అద్భుతంగా పుంజుకున్న ఫెదరర్‌.. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు. రెండో సీడ్‌ జకోవిచ్‌ (సెర్బియా) అలవోకగా ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మూడో రౌండ్లో అతడు 6-3, 6-2, 6-2తో నిషోయ్‌కా (జపాన్‌)ను చిత్తుగా ఓడించాడు. ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా), మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా), ఫోగ్నిని (ఇటలీ), సాండ్‌గ్రెన్‌ (అమెరికా), ఫుక్సోవిక్స్‌ (హంగేరి) కూడా ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్లో దివిజ్‌ శరణ్‌, అర్టెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జోడీ 6-7 (2-7), 3-6తో బ్రునో సోర్స్‌ (బ్రెజిల్‌), మేట్‌ పవిచ్‌ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది.

వోజ్నియాకి వీడ్కోలు

వోజ్నియాకి

మాజీ ప్రపంచ నం.1 కరోలిన్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌) టెన్నిస్‌ ప్రయాణం ముగిసింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తన కెరీర్లో చివరిదని చెప్పిన ఆమె.. శుక్రవారం మూడో రౌండ్లో 5-7, 6-3, 5-7 జబెర్‌ (ట్యునీషియా) చేతిలో ఓడింది. 2005లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టిన ఆమె 2018 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ట్రోఫీతో సహా మొత్తం 30 డబ్ల్యూటీఏ టైటిళ్లు గెలిచింది. వరుసగా రెండేళ్లు (2010, 2011) నంబర్‌వన్‌గా ముగించింది.

ఇవీ చూడండి.. టీ20ల్లో తొలిసారి: ఐదుగురు బ్యాట్స్​మెన్ 'హాఫ్​' సెంచరీలు

Last Updated : Feb 18, 2020, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details