ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్న ఆలోచనకు తొలి అడుగు పడింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ప్రభుత్వ భవనాలు తెలంగాణకు దక్కాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయం, శాసనసభ సహా పలు భవనాలను ఏపీ కార్యకలాపాల కోసం విభజన సమయంలో గవర్నర్ కేటాయించారు.
ఏపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం ప్రారంభించి పూర్తి స్థాయి కార్యకలాపాలు అక్కడినుంచే చేస్తుండడం వల్ల ఈ భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా కోరుతోంది. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లోని భవనాలను అప్పగించేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకరించారు.
ఏపీ ముఖ్యమంత్రి సుముఖత
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి కేబినెట్ తీర్మాన ప్రతిని అందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుముఖత, తెలంగాణ విజ్ఞప్తి నేపథ్యంలో భవనాలను తెలంగాణకు కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పోలీస్ విభాగం కోసం ఒకటి, ఇతర శాఖల కోసం మరొక భవనాన్ని హైదరాబాద్‌లో కేటాయించనున్నారు. లక్డీకాపుల్‌లో సీఐడీ కోసం నిర్మించిన భవనంలో ఏపీ డీజీపీ కార్యాలయం కొనసాగుతోంది. ఆ భవనాన్ని అలాగే కొనసాగించే అవకాశం ఉంది. మిగతా శాఖల కోసం సచివాలయంలో లేదా వెలుపల మరో భవనాన్ని కేటాయించనున్నారు. గవర్నర్ నిర్ణయంతో సచివాలయం, అసెంబ్లీ, వివిధ శాఖాధిపతుల పరిధిలోని కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన భవనాలు, వసతి గృహాలు, నివాస సముదాయాలు తదితర భవనాలన్ని పూర్తిగా తెలంగాణకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 159 భవనాలు ఉంటాయని అంచనా.
మిగిలిన శాఖలు ఎప్పుడు
మిగతా సమస్యల్లో ప్రధానంగా విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలో సంస్థలు, ఉద్యోగుల విభజనాంశాలు ఉన్నాయి. అటు విద్యుత్ ఉద్యోగుల విభజన, హోంశాఖలో డీఎస్పీల పదోన్నతులు, నాలుగో తరగతి ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారం జరగాల్సి ఉంది.
'ఏపీ భవనాలు ఇక నుంచి తెలంగాణకే' ఇదీ చదవండి: నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు